గార్లదిన్నె/శింగనమల : రాష్ట్రంలో ఉన్నది ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రభుత్వమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం గార్లదిన్నె మండలం కల్లూరులోని స్టార్ ఫంక్షన్ హాలులో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, యువతతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతతో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, శింగనమల నియోజకవర్గ పరిశీలకుడు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికీ పాటుపడ్డారన్నారు. కులం, మతం, వర్గం కాకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని పథకాలు వర్తింపజేశారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో దౌర్జాన్యాలు, దాడులు, అవినీతి, అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన ప్రజాప్రతినిధులు త్వరలో ఇంటింటికీ వస్తారని, అప్పుడు ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లోనూ గెలవడానికి కృషి చేయాలన్నారు. ‘సర్’ కార్యక్రమం నేపత్యంలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యర్శి నార్పల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు చేయించి కూటమి నేతల జేబులు నింపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యర్శి శ్రీరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి బచ్చలన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చామలూరు రాజగోపాల్, ప్రసాద్, నాగేశ్వర్‌రెడ్డి, సూర్యనారాయణ, మేధావుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫణీంద్ర, పార్టీ మండల కన్వీనర్లు ఎల్లారెడ్డి, పరాంధమ, మహేశ్వర్‌రెడ్డి, నాయకులు జేసీ నారాయణ, మంజునాథ్, పసల ఆదినారాయణ, మంత్రి ఆంజినేయులు, కాటమయ్య, కేశవయ్య, బృందావన్ రామాంజనేయులు, లక్ష్మిదేవమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో శైలజానాథ్
హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు ఫించన్ ఇస్తామని చెప్పి ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినా చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. శింగనమల నియోజకవర్గంలో నీరు లేక పండ్లతోటలు ఎండిపోతుంటే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలో భాగంగా ఈ నెల 12న శింగనమల నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి


