అనంతపురం అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా చెట్లను నరకుండా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మొహర్రం నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని చెట్లను పరిరక్షించాలన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా గుండంలో వేసేందుకు వేప, రావి, జువ్వి, మర్రి, జమ్మి, చింత వంటి వృక్షాలను నరకకుండా చూడాలన్నారు. గ్రామాల పొలిమేరల్లో ఉండే సర్కార్ జాలి (కంప చెట్లు) మొద్దులను తీసి అగ్ని గుండంలో వేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, మైనారిటీ సంక్షేమ శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొత్త యాప్‌తోనే యూరియా, డీఏపీ అమ్మకాలు
అనంతపురం అగ్రికల్చర్: రైతుల అవసరం మేరకు యూరియా, డీఏపీ ఎరువులు ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా అమ్మకాలు చేపట్టాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ ఆధార్ సంఖ్య ద్వారా తమ భూ విస్తీర్ణం, సాగు చేసిన పంటలను బట్టి ఎరువులు పంపిణీ ఉంటుందన్నారు.
ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం: జేఎన్‌టీయూ(ఏ) ఎస్కేయూ పరిధిలోని అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 8న దరఖాస్తు గడువు ముగియగా.. దాన్ని 15 వరకు పొడిగిస్తూ యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు https://apuniversitiesrecruitment.apcfss.in లో తెలుసుకోవచ్చు.
డిగ్రీ ఫలితాల
విడుదలకు కసరత్తు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలోని డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ ఫలితాల విడుదలకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. జనవరిలో పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల వెల్లడిలో జాప్యం నెలకొనడంపై 13 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంపై ‘అంతా మా ఇష్టం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ స్పందించారు. సోమవారం పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఆన్‌లైన్ నిర్వహణ సంస్థతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సక్రమమైన డేటాను అందించే అంశంలో పరీక్షల విభాగం ఉన్నతాధికారులు వైఫల్యం చెందడంతో ఫలితాల విడుదలకు జాప్యమైందని సదరు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డేటా అందిస్తే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్లు, ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని వీసీ ప్రకటించారు.
‘పరిష్కార వేదిక’లో
అర్జీల వెల్లువ
అనంతపురం అర్బన్: వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ పద్మావతి, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్ ప్రజల నుంచి 643 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీలుదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.


