● వైఎస్సార్‌సీపీ నేత ఇంటిపై దాడికి యత్నం
అనంతపురం: టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు బరితెగించారు. తాడిపత్రి నుంచి పెద్దవడుగూరుకు వాహనాల్లో వెళ్లి వైఎస్సార్‌సీపీ నేత రామచంద్రారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. మూడు రోజుల క్రితం జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దవడుగూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వైఎస్సార్‌సీపీ నాయకులు శేషారెడ్డి, శరభారెడ్డి, గూడూరు సూర్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, చితంబరరెడ్డిపై బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వైఎస్సార్‌సీపీ వాళ్లు అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్ వేస్తారో చూస్తా అంటూ రెచ్చిపోయారు. దీనికి పెద్దవడుగూరు వైఎస్సార్‌సీపీ నేత రామచంద్రారెడ్డి స్పందించారు. మండలంలో 25 పంచాయతీలకు గాను 24 పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, మరి నామినేషన్ వేయకుండా ఎక్కడ అడ్డుకున్నారు అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి తలుచుకొని ఉంటే గెలిచేవాళ్లం కాదు.. జగన్ మోహన్‌రెడ్డి పుణ్యంతోనే తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం’ అన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలను కూడా ఆ పోస్టులో గుర్తు చేశారు. వీటిని జీర్ణించుకోలేని జేసీ అనుచరులు సోమవారం 50 వాహనాల్లో పెద్దవడుగూరుకు చేరుకుని రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అయితే అప్పటికే పోలీసులు ముందస్తుగా పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్రా రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కుటుంబ సభ్యులను ఇంట్లోంచి బయటకు పంపించడంతో ఎలాంటి సంఘటనా చోటు చేసుకోలేదు.


