రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. రోజూ కూలి పనులకు వెళ్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే దంపతులు. ఇద్దరు కుమారులను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని కలలు కన్నారు. అయితే విధి ఒక్కసారిగా వారిపై పగబట్టినట్లు మారింది. ఇ | - | Sakshi
Sakshi News home page

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. రోజూ కూలి పనులకు వెళ్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే దంపతులు. ఇద్దరు కుమారులను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని కలలు కన్నారు. అయితే విధి ఒక్కసారిగా వారిపై పగబట్టినట్లు మారింది. ఇ

Jun 9 2026 4:48 AM | Updated on Jun 9 2026 4:48 AM

జయకృష్ణకు అన్నం తినిపిస్తున్న కుమారి

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం కట్టకిందపల్లికి చెందిన బుర్రా జయకృష్ణ, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు చరణ్‌ ఈసారి 9వ తరగతికి, చిన్నకుమారుడు ప్రభాస్‌ 7వ తరగతికి వెళ్తున్నారు. జయకృష్ణ బేల్దారి పని చేస్తుండగా, కుమారి కూలి పనులకు వెళ్లేది. కష్టపడి పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగించేవారు. నాలుగేళ్ల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన జయకృష్ణకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని తేలింది. అప్పటి నుంచి ప్రతివారం డయాలసిస్‌ చేయించుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్నాడు. స్వయంగా నడవలేని స్థితికి చేరుకోవడంతో భార్య తోడు తప్పనిసరి అయింది. దీంతో ఆమె కూలి పనులకు వెళ్లడం మానేసింది.

పూట గడవడమే భారంగా...

ఇద్దరూ పనులకు వెళ్లలేని పరిస్థితి రావడంతో కుటుంబానికి ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఉదయం లేవగానే ఇతర కుటుంబాలు పనులకు వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఈ కుటుంబం మాత్రం పిల్లలకు పాలు ఎలా కొనాలి.. భోజనం ఎలా పెట్టాలి? అనే ఆలోచనలతో గడుపుతోంది. కనీస అవసరాలు తీర్చుకోవడమే భారంగా మారింది.

గోరుచుట్టుపై రోకటిపోటులా..

కుటుంబం ఇప్పటికే కష్టాల్లో ఉండగా ఇటీవల భార్య కుమారి కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోవడంతో రూ.80 వేల వరకు ఖర్చు చేశారు. తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి ఆ మొత్తం పెద్ద భారంగా మారింది. అప్పులు చేసి చికిత్స చేయించుకు న్నా ఇప్పటికీ వాటి నుంచి కోలుకోలేకపోతున్నారు.

కన్నీరు తెప్పించే పెద్ద కుమారుడి త్యాగం

తల్లిదండ్రుల పరిస్థితిని చూసి పెద్ద కుమారుడు చరణ్‌ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. చదువుకోవాల్సిన వయసులో బడి మానేసి బేల్దారి పనులకు వెళ్లి రోజుకు రూ.300 సంపాదిస్తూ ఇంటికి అండగా నిలిచాడు. పుస్తకాలు పట్టాల్సిన చేతులు మట్టిగంపలు మోశాయి. గ్రామస్తులు, ఉపాధ్యాయుల చొరవతో తిరిగి బడికి వెళ్లడం ప్రారంభించినా, సెలవులు వస్తే ఇప్పటికీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తున్నాడు.

వానొస్తే ఇంట్లోకే నీరు..

కుటుంబానికి ఉన్న ఏకై క నివాసం కూడా శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడితే ఇంట్లో నీళ్లు కారుతున్నాయి. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అప్పులు, ఇంకోవైపు ఆకలి ఇలా ప్రతి రోజు ఆ కుటుంబానికి అగ్నిపరీక్షగా మారింది.

శిథిలావస్థకు చేరిన ఇల్లు, ఇద్దరు కుమారులతో బుర్రా జయకృష్ణ, కుమారి దంపతులు

మానవతామూర్తులు ఆదుకోవాలి

అనారోగ్యం, అప్పులు, ఆకలి, పేదరికం ఒకేసారి దాడి చేయడంతో కుటుంబం సాయంకోసం ఎదురుచూస్తోంది. మానవతావాదులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్న సాయం కూడా ఆ కుటుంబానికి పెద్ద ఊరటనివ్వగలదని చెబుతున్నారు. ఇద్దరు చిన్నారుల చదువులు ఆగిపోకుండా, ఆ కుటుంబం మళ్లీ నిలదొక్కుకునేలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే ఈ.కుమారి ఫోన్‌పే నంబరు

63049 15177కు పంపాలని

కోరుతున్నారు.

పేద కుటుంబంపై పగబట్టిన విధి

కిడ్నీలు క్షీణించి మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద దిక్కు

అనారోగ్యానికి గురై

నిస్సహాయురాలిగా మారిన భార్య

కన్నీరు తెప్పించే

పెద్ద కుమారుడి త్యాగం

8వ తరగతి చదువుకుంటూ

కూలీగా మారిన వైనం

మానవతావాదుల చేయూత కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబం

Advertisement
 
Advertisement
Advertisement