కూడేరు: తేనెటీగలు దాడి చేయడంతో బుక్కరాయసముద్రం మండలం దెయ్యాలకుంట పల్లికి చెందిన రామచంద్రప్ప అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం మండల పరిధిలోని కమ్మూరులో ఓ రైతుకు చెందిన మామిడి పొలంలో కొమ్మలు కత్తిరించేందుకు రామచంద్రప్ప వచ్చాడు. కొమ్మలు కత్తిరిస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కూడేరులోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లి చికిత్స అందించారు.
ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాలను ఎస్కే విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ఆచార్య జ్యోతికుమార్ సోమవారం విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్కేయూ మూల్యాంకన విభాగం డైరెక్టర్ ఆచార్య లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ పద్మశ్రీ, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి తిరుమలేష్‌లతో కలిసి ఫలితాలను ప్రకటించారు. 6వ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ పరీక్షలకు 875 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 871 మంది 99.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఉపకులపతి కళాశాల పరీక్షల విభాగాన్ని సంద ర్శించారు. పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలు, వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో పాటిస్తున్న పారదర్శకత, మెరుగైన విధానాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు జీఎల్‌ఎన్ ప్రసాద్, చంద్రశేఖర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఏఐ ప్రజావాణి ద్వారా
అర్జీల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ఏఐ ప్రజావాణిని బాధితులు సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ఏఐ ప్రజావాణి ద్వారా 15 మంది వారి సమస్యలను చెప్పుకున్నారు. బాధితుల నుంచి సేకరించిన వివరాలను ఒక ఫార్మాట్‌లో అర్జీగా తయారు చేసి ఏఐ నేరుగా ఎస్పీ జగదీష్‌కు పంపింది. మొత్తం 184 అర్జీలను ఎస్పీ స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీ మహబూబ్‌బాషా, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పిడుగుపాటుకు
పాడి ఆవు మృతి
బ్రహ్మసముద్రం: పిడుగుపాటుకు పాడి ఆవు మృతి చెందిన సంఘ టన బ్రహ్మసముద్రం మండలంలోని పోలేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పాడి రైతు మహదేవమ్మ మాట్లాడుతూ రూ.50 వేలు ఖర్చుచేసి ఆవును కొనుగోలు చేసినట్లు తెలిపారు. జీవనాధారంగా ఉన్న ఆవు మృతి చెందడంతో బోరున విలపించారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. పాడి ఆవు కళేబరాన్ని సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ లింగన్న పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
మట్కా రాస్తున్న
అత్త, కోడలి అరెస్టు
తాడిపత్రి రూరల్: మట్కా రాస్తున్న అత్త, కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన మేరకు.. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లికాలనీకి చెందిన అత్త,కోడలు వాసంతి, అలివేలు తమ ఇంట్లో మట్కా రాసేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50,150 స్వాధీనం చేసుకున్నారు. మహిళా పోలీసు సాయంతో నిందితులిద్దరినీ కోర్టులో హజరుపరిచినట్లు సీఐ తెలిపారు.


