● గుంతకల్లులో విచిత్ర సంఘటన
● డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ
ఆస్పత్రి వద్ద కుటుంబీకుల ధర్నా
గుంతకల్లు: ఆడబిడ్డ పుట్టిందని ఆ డాక్టర్ చెప్పారు. పసిగుడ్డును తల్లి చేతిలో పెట్టారు. ఇంటికి మహాలక్ష్మి వస్తోందని తండ్రి సంతోష పడ్డాడు. అందరికీ చెప్పుకుని మురిసిపోయాడు. అయితే, 39 రోజుల తరువాత.. పుట్టింది ఆడ్డబిడ్డ కాదు, మగ బిడ్డ అని తేలడంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఇదే సమయంలో ఆడ శిశువును మాయం చేసి ఎక్కడి నుంచో మగబిడ్డను తెచ్చుకున్నారనే వదంతులు వ్యాపించడంతో అవమానంగా భావించిన ఆ దంపతులు ప్రసవం జరిగిన ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. వివరాలు.. గుంతకల్లు మండలలోని నక్కన దొడ్డికి చెందిన బోయ రవికుమార్ భార్య భార్గవి గత నెల మే3న స్థానిక స్వప్న నర్సింగ్ హోమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ పుట్టిందని తల్లిదండ్రులకు డాక్టర్లు చెప్పారు. శిశువు బరువు తక్కువగా ఉండటంతో గుంతకల్లులోని సాయిక్రిష్ణ నర్సింగ్ హోమ్‌లోని చిన్న పిల్లల వైద్యుడు పవన్ వద్దకు రెఫర్ చేయగా.. అక్కడ 15 రోజుల పాటు శిశువును ఐసీయూలో ఉంచారు. అనంతరం వైద్యుడు పవన్ అందుబాటులో ఉండడని చెప్పి మరో చిన్న పిల్లల వైద్యుడు నీలకంఠరెడ్డి వద్దకు పంపారు. శిశువు గుప్తాంగం వద్ద ఉబ్బి ఉండడంతో అనుమానం వచ్చిన నీలకంఠరెడ్డి కర్నూలులోని మెడికవర్ ఆస్పత్రికి శిశువును తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లగా స్కానింగ్ చేసిన డాక్టర్లు.. పుట్టింది మగబిడ్డ అని తేల్చారు. దీంతో అవాక్కైన తల్లిదండ్రులు సోమవారం గుంతకల్లు వచ్చి సాయిక్రిష్ణ నర్సింగ్ హోమ్ వద్ద సీపీఎం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వైద్యురాలు రమణతో నాయకులు జగ్గలి రమేష్, సురేంద్రబాబు, వైటీ చెరువు రమేష్, రామునాయక్ తదితరులు వాదనకు దిగారు. డాక్టర్ రమణ మాట్లాడుతూ జన్యుపర లోపం కారణంగా శిశువులో ఒక్కోసారి ఆకారం కనబడదని, చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పగా.. అలాంటప్పడు ఆడబిడ్డ అని ఎలా నిర్ధారించారని నాయకులు నిలదీశారు. ఆడబిడ్డ అంటూ ఇప్పటికే మున్సిపాలిటీ వారు బర్త్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు కలగజేసుకుని బాధిత తల్లిదండ్రులు, నాయకులకు సర్దిచెప్పడంతో అంతా సద్దుమణిగింది.


