తాడిపత్రి రూరల్: మద్యం తాగేందుకు డబ్బులివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడిపత్రి మండలంలోని బుగ్గలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం మర్రిమాకులపల్లికి చెందిన సాంబశివ (42) తన భార్య రత్న, ఇద్దరు పిల్లలతో కలిసి 15 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం తాడిపత్రికి వలస వచ్చాడు. స్థానికంగా పానీపూరి బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సాంబశివ మద్యానికి బానిసయ్యాడు. సోమవారం మద్యం తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఇంటి వద్ద బాత్‌రూంలో కడ్డీకి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
అనంతపురం అర్బన్: మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీపీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు పసులూరి ఓబుళేసు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నాయకులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ఓ.ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, ఓబుళేసు మాట్లాడారు. మెగా డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల కారణంగా ఎస్సీ అభ్యర్థులు, పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అర్హులై ఉండి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం జరిగేవరకు వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శోభారాణి, నగర ప్రధాన కార్యదర్శి శోభన్‌కుమార్, నాయకులు లబ్బేముత్యాలప్ప, సాకే ఓబుళపతి, అంజలి, తదితరులు పాల్గొన్నారు.


