కళ్యాణదుర్గం రూరల్: ‘రెండు నెలలుగా మంచి నీరు సరఫరా కావడం లేదు. గ్రామానికి సమీపంలోని బోరు బావుల నుంచి అవస్థలు పడుతూ నీటిని తెచ్చుకుంటున్నాం. ఎవరికి విన్నవించుకున్నా దాహార్తిని తీర్చేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు’ అంటూ మండలంలోని గోళ్లవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ సోమవారం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు అర్జీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చి రెండు నెలలు గడిచిపోయిందన్నారు. ఇప్పటికై నా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు...
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోళ్ల గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గోళ్ల పంచాయతీలో ఉన్న పాతచెరువు, శిబాయి గ్రామాల్లో 10 బెల్టుషాపులు ఉన్నాయంటే మద్యం సరఫరా ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలకు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ తాగునీటి సరఫరాపై లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తాగునీటి సమస్యను పరిష్కరించలేదని సచివాలయానికి తాళం
ఎమ్మెల్యే అమిలినేనికి విన్నవించినా పట్టించుకోలేదని స్థానికుల ఆవేదన


