గుంతకల్లు రూరల్: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంతకల్లు మండలంలోని కసాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కసాపురం గ్రామంలో సుంకులమ్మ కట్ట వద్ద నారాయణ అనే రైతుకు తోట ఉంది. ఈ తోటలో సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడి వద్ద సీ.అనిత అనే పేరుతో ఏటీఎం కార్డు లభించింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి వివరాలు ఆరా తీసి అనితకు ఫోన్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తన భర్త నగేష్ (38) అని, చిన్నపాటి గొడవ జరగడంతో ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆమె తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్న అనంతరం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగేష్‌కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నట్లు తెలిసింది.
ఫుడ్ ఇండియా సదస్సుకు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్:కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జూలై 9, 10న విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఫుడ్ ఇండియా–2026 సదస్సు ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆసక్తి కలిగిన ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, చిన్న,మధ్య తరహా కుటీర పరిశ్రమల్లో తయారు చేసిన తమ ఉత్పత్తులను సదస్సులో ప్రదర్శించడం ద్వారా మార్కెటింగ్ వసతి పెంచుకోవచ్చన్నారు. ఇందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సదస్సులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, ప్రదర్శన శాలలు ఏర్పాటవు తాయన్నారు. మరిన్ని వివరాలకు హార్టికల్చర్ డీడీ (7995086792) లేదా జిల్లా రిసోర్స్ పర్సన్ బి.హరీష్ (9676796974)ను సంప్రదించాలని సూచించారు.


