● బిడ్డ కులాంతర వివాహం
చేసుకుందని దాష్టీకం
రాప్తాడు రూరల్: కులాంతర ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన ఓ యువతి కుటుంబ సభ్యులు యువకుడి నాయనమ్మ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన వరలక్ష్మి, అనంతపురం రూరల్ పాపంపేటకు చెందిన మురళి మనోహర్ ప్రేమించుకుని రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువతి మేజర్ కావడంతో కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరినీ కలిసి జీవించేందుకు అనుమతించారు. వివాహాన్ని అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు మనోహర్‌ను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రూరల్ మండలం పాపంపేట కాలనీలో ఉన్న మనోహర్ నాయనమ్మ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి కుటుంబానికి చెందిన ఆరుగురు మహిళలతో పాటు ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.


