తల్లికి వందనం.. ఎగనామం | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం.. ఎగనామం

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం క్షేత్రస్థాయిలో మాత్రం వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు వేదనగా మారుతోంది. ‘ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ లబ్ధి’ అని చెప్తున్న ప్రభుత్వం అర్హుల జాబితాను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అనర్హులుగా మారితే కారణమేంటి? ఎవరిని సంప్రదించాలి? సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? అనే కనీస సమాచారం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే డీఈఓ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. అక్కడికి వెళ్తే తమ వద్ద వివరాలు లేవంటున్నారు. ఎంఈఓ కార్యాలయాలు, పాఠశాలల హెచ్‌ఎంలూ చేతులెత్తేస్తున్నారు. చివరకు బాధితులు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశతో వెనుదిరుగుతున్నారు.

దాచిపెడితే అనుమానాలు పెరగవా?

ఏ ప్రభుత్వ పథకమైనా పారదర్శకంగా అమలు చేస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అర్హులు, అనర్హుల జాబితా లేదు. దీంతో నిజంగా ఎంతమంది లబ్ధి పొందారు? ఎంతమంది నష్టపోయారు? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. గతేడాది అనుభవాలతో పాఠాలు నేర్చుకోలేదా? గతేడాది జిల్లాలో వేలాది మంది అర్హులకు పథకం అందలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆధార్‌, బ్యాంకు ఖాతాల పొరపాట్లు, సాంకేతిక సమస్యలు, అర్హతల గందరగోళంతో చాలామంది కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగారు. అయినా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని బాధితులు చెబుతున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిపోయి, మళ్లీ అదే గందరగోళం కనిపిస్తుండడం విచారకరం.

ఎవరిని సంప్రదించాలో..

ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థి పేరు జాబితాలో లేకపోతే ఆ కుటుంబం ఎవరిని అడగాలి? ఎక్కడ న్యాయం పొందాలి? నాలుగుచక్రాల వాహనం ఉందని, 12(1)–సీ సీటు వచ్చిందని, ఆధార్‌ వివరాలు సరిపోలలేదని రకరకాల కారణాలు చూపిస్తూ అర్హులను పక్కనపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే అనర్హులైతే ఆధారాలు చూపించాలి. అర్హులైతే వెంటనే సరిదిద్దాలి. కానీ ప్రస్తుతం ఆ రెండు మార్గాలు కూడా కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

జాబితా విడుదల చేయండి..

తల్లికి వందనం పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం వెంటనే జిల్లా వారీగా అర్హులు, అనర్హుల జాబితాలను బహిరంగపరచాలి. అనర్హులుగా చూపిన ప్రతి విద్యార్థికీ కారణం వెల్లడించాలి. అభ్యంతరాలు తెలిపేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులెవరో స్పష్టంగా ప్రకటించాలి. పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి సందేహాలకు తెరదించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అర్హత ఉన్నా పలువురికి వర్తించని పథకం

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న

తల్లిదండ్రులు

సమాధానం చెప్పేవారు లేరు...

సమస్యనూ పరిష్కరించరు..

Advertisement
 
Advertisement
Advertisement