నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

అనంతపురం అర్బన్‌ ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో ప్రారంభమవుతుందని కలెక్టర్‌ ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలన్నారు. అర్జీలో ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్‌ సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా సమర్పించవచ్చని తెలియజేశారు.

వీరభద్రుని సేవలో

జస్టిస్‌ ప్రభాకర్‌ శాస్త్రి

లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామిని ఆదివారం కర్ణాటక రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ ప్రభాకర్‌ శాస్త్రి ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో సంప్రదాయం ప్రకారం జస్టిస్‌ ప్రభాకర్‌ శాస్త్రిని సత్కరించి శాలువతో సత్కరించారు.

17 మండలాల్లో వర్షం

అనంతపురం అగ్రికల్చర్‌: నైరుతి ప్రవేశంతో జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 12.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కుందుర్పిలో 80.2 మి.మీ, కణేకల్లులో 78 మి.మీ భారీ వర్షం కురిసింది. డి.హిరేహాల్‌ 56.2 మి.మీ, ఆత్మకూరు 36.4 మి.మీ, కంబదూరు 28.2, గుంతకల్లు 23.4, విడపనకల్లు 22.6, పెద్దవడుగూరు 19.6, శెట్టూరు 13.6, బొమ్మనహాళ్‌ 10.2, కూడేరు 10 మి.మీతో పాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఓవరాల్‌గా ఈ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా ప్రస్తుతానికి 24.3 మి.మీ నమోదైంది. జూన్‌ మొదటి వారం ముగిసేసరికి 15 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షం కురిసింది. గుమ్మగట్ట, తాడిపత్రి, పెద్దపప్పూరు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో పెద్దగా వర్షాలు నమోదు కాలేదు. మిగతా మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్‌ సాగుకు రెడీ అవుతున్నారు.

విదేశీ అతిథులకు

అవస్థల స్వాగతం

చిలమత్తూరు: సుదూరంలోని దేశం నుంచి వేల మైళ్లు ఎగిరొస్తాయి. స్థానికులకు కనువిందు కలిగిస్తాయి. అలాంటి విదేశీ అతిథులకు కష్టాలే స్వాగతం పలుకుతుండడం కలచి వేస్తోంది. ఈ సారి మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు కళ తప్పాయి. నీటి కోసం పశువులు, జంతువులు, పక్షులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సంతానోత్పత్తి కోసం వచ్చిన సైబీరియన్‌ కొంగలపై కూడా ఈ ప్రభావం పడింది. వర్షాభావంతో ఆయా చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో విదేశీ పక్షులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్‌ మొదలు కిందిస్థాయి అధికారులు వీరాపురం వస్తున్నారు కానీ సైబీరియన్‌ కొంగల పరిరక్షణకు కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

Advertisement
 
Advertisement
Advertisement