ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలి

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

నల్లచెరువు: హంద్రీ–నీవా రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనుల్లో భారీఎత్తున అక్రమాలకు పాల్పడిన కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య, కదిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం వారు కదిరి నియోజకవర్గ పరిధిలో హంద్రీ–నీవా లైనింగ్‌ పనులను పరిశీలించారు. నల్లచెరువు మండలం బందార్లపల్లి, తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌ సమీపాన పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి... విలేకరులతో మాట్లాడారు. హంద్రీ–నీవా లైనింగ్‌ పనుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పనులు అత్యంత నాసిరకంగా చేపడుతున్నారన్నారు. రూ.207 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులకు చంద్రబాబు ప్రభుత్వం అదనంగా రూ.102 కోట్లు కేటాయించినప్పటికీ పనుల్లో ఏమాత్రమూ నాణ్యత లేదన్నారు. ఇందులో ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిందన్నారు. నాసిరకం నిర్మాణ సామగ్రి వాడటంతో నీటి ప్రవాహానికి చాలా చోట్ల లైనింగ్‌ కొట్టుకుపోయిందన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజల సొమ్మును దోచుకునేందుకే కూటమి నాయకులు లైనింగ్‌ పనులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ చేపడుతున్న పనులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోతే వైఎస్సార్‌సీపీ పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నల్లచెరువు మండల కన్వీనర్‌ రవికుమార్‌రెడ్డి, తనకల్లు మండల కన్వీనర్‌ అశోక్‌ రెడ్డి పాల్గొన్నారు.

హంద్రీ–నీవా లైనింగ్‌లో భారీ అక్రమాలు

నాసిరకం పనులు చేసి రూ.కోట్లు కొల్లగొట్టారు

లైనింగ్‌ పనులను పరిశీలించిన మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మక్బూల్‌

Advertisement
 
Advertisement
Advertisement