శెట్టూరు: రాజకీయ పార్టీ సమావేశాలు, ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తిగత వేడుకలకు ప్రభుత్వ కార్యాలయాలు వేదికలుగా మారిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు ఎలా చెప్తే అధికారులు అలా తలాడిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇటీవల ఎంపీడీఓ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల్లో టీడీపీ మండల కన్వీనర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించడం.. అధికారులు, సిబ్బంది తమ పనిని పక్కనపెట్టి మరీ ‘పచ్చ’ సేవలో తరించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆదివారం మరోసారి అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ బూత్‌లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏల) సమావేశం ఏకంగా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఇక్కడ మండలానికి సంబంధించి కీలకమైన ఫైళ్లు, కంప్యూటర్ తదితర సామగ్రి ఉన్నాయి. సిబ్బంది ఎవ్వరూ లేని సమయంలో బయటి వ్యక్తులు యథేచ్ఛగా లోనికి వచ్చారు. గంటల తరబడి అక్కడే ఉండటంతో పాటు ఆవరణమంతా కలియదిరిగారు. విషయం తెలిసిన జనం, స్థానిక ప్రజాప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో అనధికారిక సమావేశానికి అనుమతి ఉందా.. ఎవరు పర్మిషన్ ఇచ్చారు.. ఇలా ఎవరైనా తమ ప్రైవేట్ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చా.. అని చర్చించుకోవడం కనిపించింది.
ఎంపీడీఓ కార్యాలయంలో
టీడీపీ బీఎల్‌ఏల సమావేశం
మీటింగ్ విషయం తెలీదు
ఆదివారం కార్యాలయానికి సెలవు. అయితే టీడీపీ కార్యకర్త ఒకరు మండల పరిషత్ సిబ్బంది వద్దకు వచ్చి యోగా కార్యక్రమం ఉందని చెప్పి తాళం చెవి తీసుకుని వెళ్లాడట. ఆ తర్వాత వారు కార్యాలయంలోనికి వెళ్లడం.. అక్కడే ఆవరణలో టీడీపీ బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించడం మాకు తెలియదు.
– జిలానీ బాషా, ఎంపీడీఓ, శెట్టూరు


