● టిప్పరును పట్టుకున్న పోలీసులు
శింగనమల: మండలంలోని సలకంచెరువు–కొరివిపల్లి మధ్యలోని కూతలేరు వంక, ఉల్లికల్లు, తరిమెల గ్రామాల సమీపంలోని పెన్నానది పరీవాహక ప్రాంతం నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీలతో ఇసుకను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఒకచోట డంప్ చేసి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక తరలించడం వల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని, దీన్ని అరికట్టాలని రైతుల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు శనివారం రాత్రి అనంతపురం–తాడిపత్రి రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పరును పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ టిప్పర్ అధికార పార్టీ నాయకులది కావడంతో తదుపరి చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చేనేత కార్మికుడి ఆత్మహత్య
గార్లదిన్నె: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కల్లూరుకు చెందిన రమేష్ (42) చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. మగ్గం నిర్వహణ.. కుటుంబ అవసరాల కోసం ఇతరుల వద్ద రూ.7 లక్షల దాకా అప్పులు చేశాడు. అయితే వచ్చే సంపాదన కుటుంబ పోషణకే సరిపోతోంది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో రోజూ మదనపడుతుండేవాడు. ఈ క్రమంలో రమేష్ ఈ నెల మూడో తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అయినా కోలుకోలేకపోయాడు. శనివారం రాత్రి మృతి చెందాడు. రమేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా పేర్కొన్నారు.


