అనంతపురం అగ్రికల్చర్: మేమిస్తాం... కానీ మీరు పూర్తిగా ఖర్చు చేయొద్దు... అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఓ వైపు బడ్జెట్ కేటాయిస్తూనే మరో చేత్తో అంతో ఇంతో వెనక్కి లాగేసుకుంటుండటంతో ఉద్యాన రైతుల పరిస్థితి దారుణంగా మారింది. తానా అంటే తందానా అన్నట్లుగా ఉద్యానశాఖ అధికారులు కూడా పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో రైతుకు ఫలాలు అందడం కష్టంగా మారింది. కేటాయించిన బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయకుండా మిగులుబాటు చూపిస్తూ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌ఎస్‌కే సిబ్బందితో పాటు ఉద్యానశాఖకు పెద్ద నెట్ వర్క్ ఉన్నా పథకాల అమలు, లక్ష్యాలు సాధించడంలో విఫలమవుతోంది. ఇటీవల కాలంలో చీడపీడలు, తెగుళ్లతో పంటలు దెబ్బతింటున్నా సస్యరక్షణ సలహాలు ఇచ్చేవారు లేకపోవడంతో ఉద్యానశాఖ కార్యాలయానికి రైతులు రావడం మానేశారు.
గత మార్చి నెలాఖరుతో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉద్యానశాఖ పథకాలకు రూ.18.16 కోట్లు బడ్టెట్ కేటాయించింది. అందులో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ (ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస యోజనా (ఆర్‌కేవీవై), ఆయిల్‌ఫాం (పామాయిల్ తోటలు), బ్యాంబూ మిషన్ (వెదురుసాగు) కింద వివిధ రకాల పథకాల కింద 68,643 హెక్టార్ల పంటలకు ఉపయోగపడేలా రూ.18.16 కోట్లు కేటాయించారు. గడువు ముగిసేసరికి 17,528 హెక్టార్లకు ఉపయోగపడేలా 6,280 మంది రైతులకు ప్రయోజనం కలిగేలా రూ.11.79 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేటాయించిన బడ్జెట్‌లో రూ.6.37 కోట్లు ఖర్చు చేయకుండా ప్రభుత్వానికి మిగిలేలా చేశారు. కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది కూడా జిల్లాకు రూ.18.87 కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది మాత్రం రూ.7.98 కోట్లే. దీంతో రూ.10.89 కోట్లు భారీ బడ్జెట్ వెనక్కి పంపారు. ఇలా.. రెండేళ్ల కాలంలోనే జిల్లాకు కేటాయించిన బడ్జెట్‌లో ఏకంగా రూ.17.26 కోట్లు ఖర్చు చేయకుండా ప్రభుత్వానికి మిగిలించడం విశేషం.
హార్టికల్చర్ కాంక్లేవ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2025 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి సదస్సుతో హల్‌చల్ చేశారు. కాంక్లేవ్‌కు 64 కార్పొరేట్ కంపెనీలు హాజరవడం, అందులో ఏడు కంపెనీలతో ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నందున జిల్లా రైతుల తలరాతలు మార్చేస్తామని పాలకులు గొప్పలు చెబుతున్నా కేటాయించిన మోస్తరు బడ్జెట్ కూడా ఖర్చు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్, సిమ్లా లాంటి అతిశీతల ప్రాంతాల్లో పండే ఆపిల్... ఎండలు మండిపోయే ‘అనంత’లో పండిస్తున్నారు. ఈ–క్రాప్ జాబితా చూస్తే రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ పంటలు... ఇలా 100 రకాల వరకు ఉద్యాన పంటలు 2.75 లక్షల ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఏటా రమారమి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఫలసాయం వస్తోంది. రూ.15 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం అరకొర బడ్జెట్ కేటాయిస్తుండటం, అందులోనూ ఖర్చు చేయకపోవడం, తరచూ వర్షాభావ పరిస్థితులు, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, మార్కెటింగ్ పరిస్థితి దారుణంగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతినడం, చీడపీడలు, తెగుళ్లు దాడి లాంటి సమస్యలు వేధిస్తుండటంతో తమ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.వేల కోట్లు వెచ్చించి సీమను ఉద్యానహబ్‌గా మారుస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుండటంతో రైతులు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు.
గతేడాది పూర్తిస్థాయిలో
బడ్జెట్ ఖర్చు చేయని ఉద్యానశాఖ
రూ.6.37 కోట్లు ప్రభుత్వానికి
మిగులు చూపించిన వైనం
గ్రామ గ్రామానా నెట్‌వర్క్ ఉన్నా
పథకాల అమలులో నిర్లక్ష్యం
రెండేళ్లలో ఏకంగా రూ.17.26 కోట్లు బడ్జెట్ ప్రభుత్వానికి వెనక్కి
రూ.6.35 కోట్లు వెనక్కి..
రైతుల తలరాత మార్చని ‘కాంక్లేవ్’


