నాయీ బ్రాహ్మణులకు ప్రతిభా పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

నాయీ బ్రాహ్మణులకు ప్రతిభా పురస్కారాలు

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

దరఖాస్తు చేసుకోవాలని

నిర్వాహకుల సూచన

అనంతపురం టవర్‌క్లాక్‌: పది, ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ చూపిన నాయీ బ్రాహ్మణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట రంగయ్య తెలిపారు. ఆదివారం స్థానిక జయమునెమ్మ కల్యాణ మంటపంలో ప్రతిభ పురస్కారాలకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకట రంగయ్య మాట్లాడుతూ జులై 11న నాయీ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభ పురస్కరాలు అందిస్తామన్నారు. అలాగే 12న వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి ఫలితాల్లో 480 పైన మార్కులు సాధించిన వారు, అలాగే ప్రైవేటు పాఠశాలల్లో చదివి 520 మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదివి 850 మార్కులు పొందిన వారు, ప్రైవేటు కళాశాలలో చదివి 900 మార్కులు సాధించిన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఆర్టీసీ శ్రీనివాసులు, డోర్‌ నంబర్‌ 18–1–406, వేణుగోపాల్‌నగర్‌, పాతవూరు, అనంతపురం అడ్రస్‌కు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9441222874 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

తాడిపత్రి రూరల్‌ : పట్టణ సమీపంలోని రంగప్ప కాలనీలో ఆదివారం 60 బస్తాల రేషన్‌ బియ్యంను స్వాధీనం చేసుకొని నిందితుడు చిలమకూరు సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు అప్‌గ్రేడ్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు సీఎస్‌డీటీ మల్లేష్‌తో కలిసి దాడులు జరిపామన్నారు. తాడిపత్రి పరిధిలోని పలు గ్రామాల్లోని రేషన్‌కార్డుదారుల నుంచి కిలో రూ.15 నుంచి రూ.16కు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని నిందితుడు తెలిపాడన్నారు.

పత్తి దొంగల అరెస్ట్‌

రాయదుర్గం: దొంగతనాలు ఇప్పుడు ఇళ్లు, షాపులు, బ్యాంకులు, ఏటీఎంలకే పరిమితం కావడం లేదు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంటల్ని సైతం దొచుకెళ్లే ముఠాలు తయారవుతున్నాయి. ఇలాంటి ఘటనే బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లులో చోటు చేసుకుంది. ఆదివారం రాయదుర్గం రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ వెంకటరమణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉంతకల్లుకు చెందిన రైతు బలిజ హనుమంతప్ప తన పొలంలో పత్తిని నిల్వచేశాడు. అందులోని ఐదు క్వింటాళ్ల పత్తిని రెండు రోజుల క్రితం గుర్తు తెలియన వ్యక్తులు దొంగిలించారు. దాని విలువ రూ.50 వేలు. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నబీరసూల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం నేమకల్లు క్రాస్‌ వద్ద నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. పత్తి దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఉంతకల్లుకు చెందిన వన్నూర్‌స్వామి, బలిజ నవీన్‌కుమార్‌, కురువళ్లికి చెందిన బోయ వెలిగొండ నితీష్‌, కర్ణాటక రాష్ట్రం రాయాపురానికి చెందిన వాల్మీకి హరి ఉన్నారు. పత్తి విక్రయించిన సొమ్ము రూ.44 వేలతో పాటు నేరానికి ఉపయోగించిన టాటా ఏస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాన్నట్లు సీఐ తెలిపారు.

50 అడుగుల లోయలోకి పడిన ఐచర్‌

క్లీనర్‌ మృతి, డ్రైవర్‌ ఆచూకీ గల్లంతు

ముదిగుబ్బ: మండల పరిధిలోని దొరిగిల్లు సమీపంలోని పులివెందుల ఘాట్‌లో ఆదివారం సాయంత్రం ఐచర్‌ వాహనం అదుపు తప్పి 50 అడుగుల లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన క్లీనర్‌ నవేంద్ర (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే డ్రైవర్‌ వెంకటరమణారెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. టమాట మొక్కలకు కట్టే కట్టెల లోడుతో పులివెందుల వైపు నుంచి ముదిగుబ్బ వైపునకు వస్తున్న ఐచర్‌ వాహనం ఘాట్‌ రోడ్‌లో రెండో క్రాస్‌ వద్ద అదుపు తప్పి 50 అడుగుల లోతులోకి పడిపోయిందని పోలీసులు తెలిపారు. కట్టెల కింద పడి క్లీనర్‌ మృతి చెందగా, డ్రైవర్‌ ఆచూకీ లభ్యం కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement