విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సమాజంలో ఉన్నత స్థానాలను అందుకుని తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈడిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగర శివారులోని రేణుకా యల్లమ్మ కల్యాణ మండపంలో ‘ఈడిగ (గౌడ) ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీసీ రమేష్‌గౌడ్‌, రేణుకా యల్లమ్మ సొసైటీ గౌరవ సలహాదారు బుర్రా ఆదినారాయణ గౌడ్‌, అధ్యక్షుడు జగలేటి నాగేశ్వరరావు గౌడ్‌, ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ గౌడ్‌, ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం గౌడ్‌ హాజరయ్యారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో 16వ ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 62 మంది ఈడిగ (గౌడ) విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బీసీ రమేష్‌ గౌడ్‌, విశ్వనాథ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. అవార్డులు అందుకున్న విద్యార్థులు రేపటి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు మొబైల్‌: 8977716661 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్‌ చేసే వినియోగదారులు తమ విద్యుత్‌ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలన్నారు.

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ: అనంతపురం జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు ఫోన్‌ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

ఈడిగ (గౌడ) ప్రతిభా పురస్కారాల పంపిణీలో వక్తలు

Advertisement
 
Advertisement
Advertisement