● రాజకీయ పార్టీల నాయకులకు కలెక్టర్ ఆనంద్ సూచన
ఆశల ‘నైరుతి’ ఆగమనం
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆశల నైరుతి’ వచ్చేసింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోకి రుతుపవనాలు శనివారం ప్రవేశించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ సారి కొంచెం ఆలస్యంగా జిల్లాను తాకినట్లు పేర్కొన్నారు.
● ‘నైరుతి’ నేపథ్యంలో శనివారం ఉదయం ఉక్కపోత కొనసాగగా... సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో వాతావరణం మారిపోయింది. అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. ఖరీఫ్ పంటలకు ఈ రుతుపవన వర్షాలే కీలకం కావడంతో ఎల్–నినో ప్రభావంతో ఏ మేరకు వరుణుడు కరుణిస్తాడనేది అంతుచిక్కడం లేదు. ఇటీవల తొలకర్లు కురవడంతో ఖరీఫ్ సాగుకు రైతులు రెడీ అవుతున్నారు. జూన్‌లో 61.2 మి.మీ, జూలైలో 64.3 మి.మీ, ఆగస్టులో 84.4 మి.మీ, సెప్టెంబర్‌లో 111.6 మి.మీ... మొత్తంగా నాలుగు నెలల కాలంలో 321.5 మి.మీ వర్షపాతం నమోదైతే పంటలకు ఢోకా ఉండదని చెబుతున్నారు. ప్రధానంగా జూలైలో మంచి వర్షాలు కురిస్తే 3.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
‘సర్’కు సహకరించండి
అనంతపురం అర్బన్: ‘ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 (ఎస్‌ఐఆర్) పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకున్నాం. ఎస్‌ఐఆర్ నిర్వహణకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలి’ అని కలెక్టర్ ఓ. ఆనంద్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఆర్‌ఓ ఎ. మలోలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002 సంవత్సరంలో ఉన్న ఓటర్లు, 2025లో ఉన్న ఓటర్లు, వారి పిల్లలకు సంబంధించి 68 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందన్నారు. మ్యాపింగ్ 90 శాతానికి తక్కువ కాకుండా పూర్తిచేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. ఆదివారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి మ్యాపింగ్ చేస్తారని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు పాల్గొని సహకరించాలన్నారు. 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి అందించే ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు పూరించి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జూలై 14 నుంచి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబరు 18వ తేదీలోపు పరిష్కరిస్తారన్నారు. సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందని చెప్పారు. ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులకు ఈ నెల 10 నుంచి 13 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, ఎన్నికల డీటీ కనకరాజు, ఎస్‌ఏ శామ్యూల్ బెంజిమన్, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి అమర్‌నాథ్‌రెడ్డి, టీడీపీ నారాయణస్వామి, జనసేన కిరణ్‌కుమార్, సీపీఎం బాలరంగయ్య, కాంగ్రెస్ బషీర్, బీజేపీ ఈశ్వర్‌ప్రసాద్, ఏఏపీ మసూద్‌వలి, బీఎస్‌పీ ప్రతినిధి అంజయ్య పాల్గొన్నారు.
‘యోగాంధ్ర’ను విజయవంతం చేయాలి
అనంతపురం అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈనెల 21న చేపట్టనున్న యోగాంధ్ర– 2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలిచ్చారు. ఈ నెల 16న దివ్యాంగులకు థిమాటిక్ యోగా, 18న బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో, 20న గుత్తికోటలో ప్రత్యేక పర్యాటక డెస్టినేషన్ యోగా ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. యోగాపై ఆసక్తి పెంపొందించేందుకు ఆదివారం నుంచి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించనున్నామన్నారు. ప్రతి సచివాలయానికి 10 మంది ట్రైనీలను మ్యాపింగ్ చేసి యోగా శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.
త్వరలోనే విడుదల చేస్తాం
జ్ఞానభూమి పోర్టల్‌లో ఫలితాలు నమోదు చేయడానికి ఓ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చాం. ఎస్కే యూనివర్సిటీతో ఆ సంస్థ సమన్వయం చేసుకోవడంలో జాప్యం జరుగుతోంది. వారితో మాట్లాడి త్వరలోనే ఫలితాలు విడుదలయ్యేలా చూస్తాం.
–శ్రీరాములు నాయక్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఎస్కేయూ


