విద్యా విప్లవానికి పాతర | - | Sakshi
Sakshi News home page

విద్యా విప్లవానికి పాతర

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

తన హయాంలో సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకూ అండగా నిలిచిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యార్థులకూ బాసటగా నిలిచారు. ‘మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి’ అని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లోనూ చేసి చూపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు సమకూర్చారు. ఆధునిక విద్యను దగ్గరకు చేర్చారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. జగన్‌పై అక్కసు పెంచుకున్న బాబు సర్కారు.. పేద విద్యార్థుల బంగారు భవితపై నీళ్లు చల్లింది.

తాడిపత్రి రూరల్‌: గత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా అడుగులు వేసింది. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. డిజిటల్‌ బోధనకు శ్రీకారం చుట్టింది. రూ.33 వేల విలువ చేసే ఒక్కో ట్యాబ్‌ను పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసింది. రూ.110 కోట్లు ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో ఏకంగా 33,405 మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసింది. ట్యాబ్‌లలో సాంకేతిక సమస్య తలెత్తితే ఏడు రోజుల్లో సరిచేసేలా, 30 రోజుల్లో మళ్లీ లోపాలు గుర్తిస్తే కొత్త వాటిని అందజేసేలా ఒప్పందం చేసుకుంది. 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల విద్యార్థులకు సరిపోయే విధంగా బైజూస్‌ కంపెనీతో కలిసి సమగ్ర వివరాలు పొందుపరిచింది.

సర్కారు నిర్లక్ష్యంతో పనిచేయని ట్యాబ్‌లు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లు చంద్రబాబు ప్రభుత్వ పుణ్యమా అని నేడు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. పెత్తందారీ పోకడలతో ముందుకెళ్తున్న బాబు సర్కారు పేద విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌లను అప్‌డేట్‌ చేయకపోవడంతో అవి పనిచేయడం లేదు. ఉచిత ఇంటర్నెట్‌ డేటా ప్లాన్‌ గడువు ముగిసినా రెన్యూవల్‌ చేయలేదు. ప్రైవేటు కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని ఏకంగా రద్దు చేసి విద్యా విప్లవానికే చరమగీతం పాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంతా ఆర్భాటమే..

తమ ప్రభుత్వం ఏర్పడగానే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని కూటమి నేతలు ఎన్నికలు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆ విషయమే పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామంటూ ఏడాది క్రితం ఇన్ఫోసిస్‌ కంపెనీతో కలిసి ప్రకటించినా నేటికీ అమలు కాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో షరామామూలుగా ఈ హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ హయాంలో ఇచ్చిన ట్యాబ్‌లకే మరమ్మతులు చేయించి అందజేస్తే ప్రభుత్వ నిధుల ఆదాతో పాటు పేద విద్యార్థులకు మేలు చేసినట్లవుతుందని పలువురు అంటున్నారు.

పేద విద్యార్థుల బంగారు భవితపై

నీళ్లు చల్లిన చంద్రబాబు ప్రభుత్వం

ఉన్నతాశయంతో అందించిన ట్యాబ్‌ల నిర్వహణను గాలికి వదిలిన వైనం

జగన్‌పై అక్కసుతో కుటిల నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement