● డీఈఓ కుర్చీ కోసం పలువురి ప్రయత్నాలు
● కర్నూలు, శ్రీసత్యసాయి, విజయవాడ అధికారుల మధ్య తీవ్ర పోటీ
● ఎవరి లాబీయింగ్ ఫలిస్తుందోనని ఉత్కంఠ
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కుర్చీ కోసం పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెగ్యులర్ డీఈఓ నియామకం ఎప్పుడు జరుగుతుంది.. ఆ కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు అనే చర్చ విద్యాశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవలి దాకా జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన ఎం. ప్రసాద్‌బాబు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో పోస్టు ఖాళీ అయ్యింది. అప్పటి నుంచి సీటుపై పలువురు అధికారులు దృష్టి సారించారు. విద్యాశాఖలో కీలకంగా భావించే పోస్టును దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
ముగ్గురి మధ్య ప్రధాన పోటీ?
విద్యాశాఖ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ముగ్గురు అధికారులు ప్రధానంగా రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా నుంచి ఒకరు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి మరొకరు, విజయవాడ ప్రాంతానికి చెందిన మరో అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వీరు మాత్రమే కాకుండా మరికొందరు అధికారులు కూడా తమ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యే కొనసాగుతోందని విద్యాశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రజాప్రతినిధుల ఆశీస్సుల కోసం..
జిల్లా స్థాయిలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలోనూ కీలక ప్రజాప్రతినిధుల వద్ద సిఫార్సు లేఖలు పొందేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక కీలక మంత్రి వద్ద ఈ వ్యవహారంపై చర్చ జరిగినట్లు విద్యాశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ముడుపులు ముట్టజెప్పేందుకూ రెడీ!
వివిధ స్థాయిల్లో బేరసారాలు కూడా జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. భారీగానే ముడుపులు ముట్టజెప్పేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీఈఓ నియామకం ఆలస్యం కావడానికి పరిపాలనా కారణాల కంటే పైరవీలు, రాజకీయ సమీకరణాలే కారణమన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో విద్యా పరిపాలనకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో రెగ్యులర్ డీఈఓ లేకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. డీఈఓ కుర్చీపై కన్నేసిన అధికారులంతా తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో చివరకు ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పైరవీలు, రాజకీయ సమీకరణాలు, పరిపాలనా అంశాలు... వీటిలో ఏది పైచేయి సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.


