సీకేపల్లి తహసీల్దార్‌ స్వామిభక్తి | - | Sakshi
Sakshi News home page

సీకేపల్లి తహసీల్దార్‌ స్వామిభక్తి

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

బీఎల్‌ఏల సమావేశంలో టీడీపీ నాయకులకు ప్రాధాన్యం

ఏకంగా వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకున్న వైనం

కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ నేతల వద్ద స్వామిభక్తిని చాటుకున్నారు చెన్నేకొత్తపల్లి తహసీల్దార్‌. ప్రత్యేక ఓటరు నమోదు (సర్‌) కార్యక్రమంలో భాగంగా శనివారం చెన్నేకొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో బీఎల్‌ఓలతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బీఎల్‌ఏల ఇన్‌చార్జ్‌ ఫణికుమార్‌తో పాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులను తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ వేదికపైకి ఆహ్వానించి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇందుకు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇటువంటి సమావేశాలలో ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రాధాన్యత కల్పించకుండా అందరినీ సమానంగా చూడాలన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన తహసీల్దార్‌ తీరుకు వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏలు నిరసన తెలియజేశారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే వేదికపైకి ఎలా ఆహ్వానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తహసీల్దార్‌తో పాటు టీడీపీ నాయకులు దీనిని పట్టించుకోకుండా వ్యవహరించటంతో వారంతా సమావేశాన్ని బహిష్కరించారు. ఈ ఘటనపై స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితో పాటు సీఈఓకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు చింతా మధుసూదన్‌, మల్లెల నరసింహులు, కర్ర కిష్టప్ప తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement