‘ఆల్‌ ఇండియా రేడియో’ మన దేశానికే గర్వకారణం. వార్తలు మాత్రమే కాదు రేడియో నాటికలు, ధారావాహికాలు , ధర్మ సందేహాలు, చలన చిత్ర పాటలు, వివిధ భారతి, జాతీయ వార్తలు, స్పాట్‌ లైట్‌, సంగీత కచేరీలు, ప్రముఖుల పరిచయం, ఇంటర్వ్యూలు, జాతీయ నాయకుల ప్రసంగాలు ఇలా ఒక్కటేంటి అన | - | Sakshi
Sakshi News home page

‘ఆల్‌ ఇండియా రేడియో’ మన దేశానికే గర్వకారణం. వార్తలు మాత్రమే కాదు రేడియో నాటికలు, ధారావాహికాలు , ధర్మ సందేహాలు, చలన చిత్ర పాటలు, వివిధ భారతి, జాతీయ వార్తలు, స్పాట్‌ లైట్‌, సంగీత కచేరీలు, ప్రముఖుల పరిచయం, ఇంటర్వ్యూలు, జాతీయ నాయకుల ప్రసంగాలు ఇలా ఒక్కటేంటి అన

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

ఘనంగా ఆకాశవాణి అమృతోత్సవాలు

అనంత రేడియో స్టేషన్‌ ఆరంభం ఆసక్తికరం

90 ఏళ్లుగా కొనసాగుతున్న ఆల్‌ ఇండియా రేడియో సేవలు

అనంతపురం కల్చరల్‌: ‘ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శుయంతాం. ప్రవాచకః బలదేవానంద సాగరః’ అంటూ రేడియోలో సమ్మోహనంగా వినిపించే ఆ కంఠం కోసం వేలాది మంది శ్రోతలు ఎదురు చూసేవారు. దశాబ్దాల కిందట ఢిల్లీ నుంచి ప్రసారాలు ఆరంభమై తొలి తెలుగు రేడియో స్టేషన్‌ విజయవాడకొచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌ మీదుగా కడప ప్రసారాల నుంచి స్వతంత్రంగా ‘అనంత’కు చేరింది. దీని వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగున్నాయి.

జనరంజకంగా...

సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దూసుకెళ్తున్నా తరగని ఆదరణ ఆకాశవాణిది. సాధారణ సెల్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వరకు ఎఫ్‌ఎం స్టేషన్‌ తప్పనిసరిగా ఉండడమే దీనికి నిదర్శనం. కాబట్టే అన్ని వర్గాల శ్రోతలు ఉదయం నుంచి రాత్రి దాకా సాగే వేర్వేరు కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్న విషయమూ ఆశ్చర్యకరంగా ఉంటుంది. తెల్లవారు జామున మధురమైన సంగీత ధ్వనితో తట్టిలేపుతూ సాగే భక్తిరంజని, దేశభక్తిగేయం, వినదగు మాట, సేద్యపు సుద్దులు మొదలు చిత్రసీమ, చిత్ర జగత్‌, హలో అభిలాష , శ్రోతలు కోరిన సినిమా పాటలు ఈ నాటికీ జనరంజకంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘ఆల్‌ ఇండియా రేడియో’గా నామకరణం చెంది 90 ఏళ్లు గడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘అమృతోత్సవ్‌’ పేరుతో ఆకాశవాణి విభిన్న కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ప్రతి ఏడాది జూన్‌ 8న రేడియో దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

రాజీవ్‌గాంధీ హత్యతో వాయిదా..

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 12 రేడియో స్టేషన్లుంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అనంతపురంతో కలిసి విశాఖపట్నం, విజయవాడ, మార్కాపురం, నెల్లూరు, కడప, తిరుపతి, కర్నూలు వంటి చోట్ల 8 కేంద్రాలు మాత్రమే మిగిలాయి. అనంత కేంద్రం 1991 మే 22న ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ అదే ఏడాది మే 21న రాజీవ్‌గాంధీ హత్య జరగడంతో వారం రోజుల తర్వాత అంటే 29న అనంతపురంలో (ఎఫ్‌.ఎం స్టేషన్‌ హోదాలో) అధికారికంగా ప్రసారాలు ప్రారంభమయ్యాయి. స్థానిక కళలకు, కళాకారులకు, సాహిత్యానికి ఎక్కువ అవకాశాలివ్వడానికి తక్కువ పరిధి మాత్రమే ఉండే ఎఫ్‌.ఎం.(రీఫీక్వెన్సీ మాడ్యులేషన్‌) ప్రారంభించారు. వీటినే ఎల్‌ఆర్‌ఎస్‌ (లోకల్‌ రేడియో స్టేషన్‌)అని కూడా పిలుస్తారు.

సృజనలో జాలువారిన ‘అనంత’

ప్రసిద్ధి చెందిన ఎంతో మంది సినీ రచయితలు, నటులు ఆకాశవాణిని దిగ్విజయంగా నడిపినట్టే అనంతపురంలోనూ ఎంతో మంది అధికారులు విభిన్నంగా, విలక్షణంగా తమదైన సృజనతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శ్రోతలకు రేడియోను మరింత దగ్గర చేశారు. అనంతపురం ఆకాశవాణి ప్రారంభం నాటికి డాక్టర్‌ పద్మనాభరావు తొలి స్టేషన్‌ డైరెక్టర్‌ కాగా, తొలి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ పనిచేశారు. ఆరవేటి శ్రీనివాసులు, డాక్టర్‌ మాచిరెడ్డి, అంజనప్పలు కేంద్రం డైరెక్టర్లుగా విధులు నిర్వహించారు. ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా రమణమూర్తి, విద్యాలంకార్‌, కళాకృష్ణ, మహేశ్వర్‌, వసుమతి, హరి, శివశంకరరెడ్డి, మురళీ, వై.శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి పనిచేశారు. ప్రస్తుతం శృతి ప్రియాంక కేంద్రం అధికారిణిగా ఉన్నారు. ప్రధానంగా నాగసూరి వేణుగోపాల్‌, నాగేశ్వరరెడ్డి హయాంలో అనంత కళలు, సాహితీ ప్రచారం మరింత విస్తృతమైంది. వీరందరూ ఒక ఎత్తైతే రేడియో అనగానే మధురంగా వినపడే కంఠాలు అనౌన్సర్లవి. తొలిరోజుల్లో పుష్పరాజ్‌, పోతన్న, అమృత ఉండేవారు. తర్వాత వచ్చిన సుభాన్‌, డాక్టర్‌ జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి వంటి వారు మంత్ర ముగ్దులను చేసే కంఠంతో ఎన్నో కార్యక్రమాలు కళ్లకు కట్టినట్టు నడిపించారు. వీరందరూ పదవీ విరమణ చేయగా ప్రస్తుతం క్యాజువల్‌ అనౌన్సర్లు అనంతపురం ఆకాశవాణిని ఆ పాత ఒరవడిలోనే హృద్యంగా కొనసాగిస్తున్నారు.

సందర్భం రేపు రేడియో దినోత్సవం

శ్రోతలు మెచ్చే ఆ పాత మధురాలు

ప్రాంతాలకు తగ్గట్టుగా కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా అనంత ఆకాశవాణి ప్రసారాల పేర్లను ఇక్కడి భాష, యాస వచ్చేవిధంగా మార్పు చేశారు. పొలం కబుర్లు కాస్తా ‘సేద్యం సుద్దులు’గా, సూక్తి సుభాషితం, సుభాషిత రత్నావళి వంటి వాటిని ‘వినదగు మాట’గా మార్చారు. రైతుల కోసమైతే నిత్యం ప్రత్యేక ప్రసారాలు సాగుతాయి. ప్రతి ఫిబ్రవరి 15న రేడియో రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక టీవీలు, సెల్‌ఫోన్లు ఎన్నున్నా రేడియోలో వచ్చే పాటలంటే ఎంతో మంది చెవి కోసుకుంటారు. కాబట్టే ఆకాశవాణి ప్రసారం చేస్తే అనేక కార్యక్రమాల్లో ఆ పాత మధుర గీతాలది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచనలు, బాలల కోసం వచ్చే కార్యక్రమాలు, డాక్టర్లతో, లాయర్లతో, విద్యావేత్తలతో , కవులు, కళాకారులతో చేసే కార్యక్రమాలకు ఈనాటికీ ఎంతో ఆదరణ ఉంటోందని అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement