రాయదుర్గం: రాయదుర్గంలో చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల పట్టణంలోని బీటీపీ రోడ్డు బైలాంజనేయస్వామి ఆలయం వద్ద వందకు పైగా చింత చెట్లను పలువురు నేలకూల్చి సొమ్ము చేసుకున్నారు. తాజాగా టీచర్స్ కాలనీ, భంభంస్వామి ఆలయ పరిసరాల్లో దారికిరువైపులా నాటిన వృక్షాలతో పాటు సమీపంలోని చింత చెట్లను కూల్చేశారు. నిత్యం ఆహ్లాదాన్ని పంచుతున్న చెట్లను నరికివేస్తుండడాన్ని జీర్ణించుకోని స్థానికులు నిలదీయగా అక్రమార్కులు రెండు రోజులు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత యథావిధిగా చెట్లు నేలకూల్చారు. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుమతులు తీసుకోకుండానే...
పట్టా భూమిలో చెట్టు నరకాలన్నా సంబంధిత మండల తహసీల్దారు వద్ద అనుమతి తీసుకుని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లా అధికారులు పర్మిట్ ఇచ్చాక ఒక్కో టన్ను కలపకు రూ.16,800 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రాయదుర్గంలో చింత చెట్లు, దారికి ఇరువైపులా నాటిన వృక్షాలను నేలకూల్చిన వారు ఇలాంటి అనుమతులేవీ తీసుకోలేదని తెలిసింది.
పట్టించుకోని అధికారులు..
మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. స్వార్థపరులు కొందరు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీంతో ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కరువవడంతో కొందరు యథేచ్ఛగా అడవుల్లోని చెట్లను నేలకూల్చి జేబులు నింపుకుంటున్నారు.
ఇటుక బట్టీలకు తరలింపు..
రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో ఇటుకలను కాల్చేందుకు కలప వినియోగిస్తున్నారు. దీంతో కొందరు చెట్లను నేలకూల్చి కలపగా మార్చి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఏ ఇటుక బట్టీ వద్దకు వెళ్లి చూసినా కలప గుట్టల కొద్దీ దర్శనమిస్తోంది. పచ్చదనం కనుమరుగవుతుండడం చూసి పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రత్యేక నిఘా ఉంచాం
కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. రాయదుర్గం టీచర్స్ కాలనీ, భంభంస్వామి ఆలయ పరిసరాల్లో చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకున్నాం. చెట్లను సంరక్షిస్తాం. వేరే ప్రాంతాల నుంచి రాయదుర్గం మీదుగా తరలివెళ్లే కలపను సైతం నిశితంగా పరిశీలిస్తున్నాం. అనుమతుల్లేకుంటే సీజ్ చేస్తున్నాం. ఇటుక బట్టీల్లో కలప పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు.
– దామోదర్‌రెడ్డి, డీఆర్‌ఓ, రాయదుర్గం


