పామిడి: మండలంలోని కట్టకిందపల్లి గ్రామ మలుపు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రామగిరి దిగువ తండాకు చెందిన లక్ష్మానాయక్ (35) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాలమేరకు.. వజక్రరూరు మండలంలోని బోడిసానిపల్లిలో పనిముగించుకున్న లక్ష్మానాయక్ తన ద్విచక్ర వాహనంలో రామగిరి దిగువ తండాకు బయలుదేరారు. కట్టకిందపల్లి గ్రామ సమీపంలో అటు వైపుగా వస్తున్న ఆటో – ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఘటనలో లక్ష్మానాయక్ తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రుక్మిణితో పాటు కుమారుడు, కుమారులు ప్రశాంత్, సుమంత్‌లు ఉన్నారు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
ఉరవకొండ (విడపనకల్లు): విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరుకు చెందిన రైతు బోయ సురేష్ (30) శనివారం విద్యుదాఘాతంతో చనిపోయాడు. వివరాలు.. పాల్తూరుకు చెందిన సురేష్ వ్యవసాయం చేసుకోని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం కొళాయి నీటి వద్ద మోటార్‌ను ఆన్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే మోటార్ వైర్ కట్ అయిన విషయాన్ని గుర్తించకపోవడంతో మోటార్ ఆన్ చేయగానికి విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య ఉన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
లేపాక్షికి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించాలి
లేపాక్షి: జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయానికి లండన్ కేంద్రంగా పనిచేస్తున్న బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించాలని నిర్వాహకులకు విన్నవించినట్లు చరిత్రకారుడు, పర్యాటరంగ నిపుణుడు మైనాస్వామి వెల్లడించారు. శనివారం సాయంత్రం స్థానిక ఏపీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయ సముదాయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. మూడు అంగుళాల సూక్ష్మ శిల్పం నుంచి 12 అడుగుల పెద్ద శిల్పం వరకు ఉన్న శిల్పాలు, ఆసియా దేశాల్లోకెల్లా పెద్దదైన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం, నేలను తాకని ఆకాశ స్తంభం, అతిపెద్ద నంది విగ్రహం, 33 అడగుల పొడువు 20 అడుగుల ఎత్తు గల నంది విగ్రహం లేపాక్షి ప్రత్యేకతలను చాటుతున్నాయని చెప్పారు. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానిక నిర్వాహకులకు విషయం తెలుపగా త్వరలో వారు లేపాక్షిని సందర్శించి అన్ని విషయాలను నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.


