కేబుల్‌ దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కేబుల్‌ దొంగ అరెస్ట్‌

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

పుట్లూరు: రైతులు పంటలకు, పండ్ల తోటలకు నీరు అందించడానికి ఏర్పాటు చేసుకున్న బోరుబావుల వద్ద కేబుల్‌ వైర్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని శనివారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ సత్యబాబు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పుట్లూరు మండలం మడుగుపల్లి అటవీ ప్రాంతంలో బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన తమ్మినేని మురళీ చోరీ చేసిన కేబుల్‌ను విక్రయించడానికి తరలిస్తున్నాడనే సమాచారంతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో రూ.4 లక్షల విలువైన 1397 మీటర్ల వైరుతో పాటు మూడు ఐరన్‌ పైపులు, ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. చోరీలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులు గురి చేస్తున్న దొంగను అరెస్ట్‌ చేయడంపై సీఐ సత్యబాబు, ఎస్‌ఐ సురేంద్రబాబు, ఏఎస్‌ఐ ఆదినారాయణ, కానిస్టేబుళ్లు వెంకటరమణ, రమేష్‌, నరేష్‌కుమార్‌ తదితరులను ఉన్నతాధికారులు అభినందించారు.

ఇరు వర్గాల ఘర్షణ

నార్పల: భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. మండలంలోని బండ్లపల్లిలో నివాసముంటున్న నారాయణరెడ్డికి నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. నాగభూషణరెడ్డి, సాయి భూషణ్‌రెడ్డి అన్నదమ్ములు. కాగా.. వీరికి ఆరెకరాలకు పైగా భూమి ఉంది. ఇటీవల జరిగిన రీ సర్వేలో నారాయణరెడ్డికి చెందిన 44 సెంట్ల భూమి నాగభూషణ్‌రెడ్డి పేరిట నమోదైంది. భూమిలో దుక్కులు చేసేందుకు నాగభూషణ్‌రెడ్డి ప్రయత్నించడంతో అది తన భూమి అంటూ నారాయణరెడ్డి, ఆయన కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement