అనంతపురం ఎడ్యుకేషన్: అమ్మా డెయిరీపై ఎమ్మెల్యే పరిటాల సునీత దుష్ప్రచారం ఆపకపోతే మహిళలే నాలుక చీరేస్తారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల నుంచి డబ్బు వసూళ్లు చేశారన్న ఆరోపణలను ఖండించారు. 3,900 మంది మహిళా రైతులు షేర్ల రూపంలో చెల్లించిన సొమ్మును తిరిగి తీసుకున్నారని, అవసరమైతే బ్యాంకు స్టేట్‌మెంట్లు పరిశీలించాలని సునీతకు సూచించారు. రాక్రీట్ సంస్థ పనులకు రూ.415 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా రూ.310 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపారు. మిగిలిన బిల్లుల కోసం సంస్థ కోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రైతులకు నీళ్లివ్వడంలో సునీత విఫలం..
పంటలు ఎండిపోతున్నాయని, బోర్లలో నీటి మట్టాలు తగ్గిపోయాయని రైతులు పలుమార్లు పరిటాల సునీతను కలిసి పేరూరు డ్యాంకు నీళ్లు ఇప్పించాలని కోరినా ఆమె పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీడిపల్లి–పేరూరు డ్యాం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సామర్థ్యాన్ని 3.9 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీలకు పెంచి పనులు చేయించామని తెలిపారు. 2023 నాటికే 67 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పీఏబీఆర్ నుంచి ఆత్మకూరు మీదుగా పాపంపేట వరకు తాగునీటి పైపులైన్ పనులకు తమ హయాంలో టెండర్లు పిలిచి అధిక శాతం పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. కేవలం 10 శాతం పనులు పూర్తి చేస్తే ఆత్మకూరుకు నీళ్లు అందేవని, కానీ రెండేళ్లుగా ఆ పనులు ఎందుకు చేయలేదని సునీతను ప్రశ్నించారు. తాము ప్రారంభించిన తాగునీటి పథకాన్ని కొనసాగించకుండా వదిలేయడం వెనుక కమీషన్ల రాజకీయాలు ఉన్నాయా? అని నిలదీశారు. 110 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా స్పందించడం లేదని విమర్శించారు.
అందుకే ఆన్‌లైన్‌లో మహానాడు..
చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, రైతులు, నిరుద్యోగులను మోసం చేసిందని, ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఈసారి మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించారని ప్రకాష్‌రెడ్డి అన్నారు. తొలి ఏడాది కడపలో మహానాడు నిర్వహించిన చంద్రబాబు, రెండేళ్లు గడిచినా మేనిఫెస్టో అమలు చేయకపోవడంతో ప్రజల మద్దతు కోల్పోయారని విమర్శించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన టీడీపీకి ప్రజలు దూరమయ్యారని, అందుకే ఈసారి ఆన్‌లైన్ మహానాడు నిర్వహించారని ఎద్దేవా చేశారు.
ఇళ్ల నిర్మాణాలపై ఓపెన్ చాలెంజ్
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను కావాలనే అడ్డుకుంటున్నారని, ఇప్పటికీ లక్షా 80 వేల రూపాయలతో ఇల్లు నిర్మించి చూపేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అదే పని పరిటాల సునీత చేయగలరా అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలపై జరిగిన విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పాపంపేటలో ఇళ్ల కూల్చివేతలు, భూముల రిజిస్ట్రేషన్లు, బినామీల పేర్లతో భూ వ్యవహారాలు జరిగాయంటూ ధ్వజమెత్తారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీపైనా, ప్రజల సమస్యలపైనా తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జున, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, మజ్జిగ శంకరయ్య, మేడాపురం మనేరు నరసింహులు, సీకే పల్లి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
మహేశ్వరరెడ్డిది ఆత్మహత్య అని తెలిసినా అసత్య ప్రచారం
రాక్రీట్‌పై ఇంకెన్నాళ్లు అక్కసు?
ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపాటు


