● కాసుల కోసం ఖాకీల కక్కుర్తి
● సెటిల్‌మెంట్ల కేంద్రంగా పోలీస్ స్టేషన్
● అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పంచాయితీలు
తాడిపత్రిటౌన్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు పాటుపడాల్సిన పోలీసులు దారి తప్పుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కనపెట్టి అధికార టీడీపీలో చిన్నబాస్‌గా చెలామణి అవుతున్న నాయకుడి డైరెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘పచ్చ’ నేతలతో స్టేషన్‌ను నింపి.. సెటిల్‌మెంట్ల ద్వారా కాసులు వెనకేసుకుంటున్నారు. ఇదీ తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లోని అధికారుల తీరు. విశ్వసనీయ సమాచారం మేరకు.. స్టేషన్‌లోని కీలక అధికారి రోజూ సాయంత్రం ‘చిన్నబాస్’తో బాబా ఆలయంలో భేటీ అవుతుంటారు. ఎవరిపై కేసులు పెట్టాలి.. ఏ సెక్షన్లు పొందుపరచాలో సూచిస్తే అధికారి ఆ విధంగా నడుచుకుంటున్నారు. స్టేషన్‌లో జరిగే పంచాయితీలను రూ.లక్షకు పైగా గిట్టుబాటు అయితే కీలక అధికారి.. ఆలోపు ఉంటే కిందిస్థాయి అధికారులు చేస్తుంటారు. వీరిని ఆదర్శంగా తీసుకుని కిందిస్థాయి సిబ్బంది కూడా చిన్నాచితకా సెటిల్‌మెంట్లు కానిచ్చేస్తున్నారు. ఇదంతా ‘పచ్చ’ నేతల సమక్షంలోనే సాగుతోంది. ఇక పట్టణంలో మట్కా, పేకాట క్లబ్‌లకు అనధికార పర్మిషన్లు ఇస్తూ రోజు రూ.50 వేలకు పైగా ముడుపులు అందుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఎప్పుడు చూసినా అధికార పార్టీ నేతలే కనిపిస్తుండటంతో ‘ఇది పోలీస్ స్టేషనా.. లేక ‘పచ్చ’ నేతల నిలయమా’ అని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.
ఖాకీల తీరు వివాదాస్పదం..
తాడిపత్రి పట్టణంలో ప్రధానంగా ఐదుగురు అధికార పార్టీ నాయకులు మట్కా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మట్కా నిర్వాహకుల్లో ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అదీ ఏఎస్పీ టీం రెడ్‌హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు. మిగిలిన ఐదుగురు నిర్వాహకుల జోలికి వెళ్లే సాహసం మాత్రం చేయడం లేదు.
● ఇక గంజాయి విషయానికి వస్తే నెల క్రితం ఓ లాడ్జ్‌లో దాదాపు పది కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు ఒడిశా యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాడిపత్రిలో వారు ఎందుకు ఉన్నారు.. ఎవరికి అమ్ముతున్నారు.. అని విచారణ చేయకుండా రైల్వే స్టేషన్‌లో తచ్చాడుతూ కనిపిస్తే పట్టుకున్నామని చెప్పి.. ‘గంజాయి బ్యాచ్’కు అండగా నిలిచి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు తెలిసింది.
● పట్టణంలో ఇద్దరు బాలికలను ఇద్దరు అబ్బాయిలు ప్రేమ పేరుతో మోసం చేసి పది తులాల బంగారు ఆభరణాలు కాజేశారు. దీన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు రూ.5 లక్షలు అప్పగించి మిగిలినది పోలీసులు స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● తక్కువ ధరకే బంగారు ఇప్పిస్తామని పలువురి నుంచి రూ.కోట్లల్లో డబ్బు సేకరించి, మోసగించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి 13 తులాల బంగారు లభ్యమైందని చెప్పి రిమాండ్‌కు పంపారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది.


