పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

అనంతపురం అర్బన్‌: పర్యారవణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని, ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఆనంద్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి ఎకాలజీ సెంటర్‌ వరకు అవగాహన ర్యాలీకి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. జిల్లాలో 13 లక్షల విత్తన బంతులు, కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. కార్యక్రమంలో సామాజిక వన విభాగం అధికారి గురు ప్రభాకర్‌, కాలుష్య నియంత్రణ శాఖ అధికారి శశికళ, డీఆర్‌డీఏ పీడీ శైలజ, వ్యవసాధికారి సాలురెడ్డి, ఆర్డీటీ ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు దీపా, శివరాం, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, నర్సింగ్‌ విద్యార్థులు, న్యాయవాదులు, జిందాల్‌ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సంయమనంతో

పరిష్కరించుకోవాలి

గుమ్మఘట్ట: అన్నదమ్ములు, దాయాదుల మధ్య ఉన్న భూ సమస్యలను సంయమనంతో పరిష్కరించుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం ఆర్డీటీ ఫీల్డ్‌ ఆఫీసులో శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల.. ఒక నియోజకవర్గం.. నాలుగు సందర్శనలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై ప్రజల నుంచి 39 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలతో కార్యాలయాలు, కోర్టులకు వెళ్లి సమయాన్ని, డబ్బును వృథా చేసుకుని జీవితాలను నాశనం చేసుకోరాదని హితవు పలికారు. అనంతరం రాయంపల్లి సమీపంలో ఉన్న గవిసిద్దేశ్వర స్టీల్‌ ఇండియా ప్రైవేట్‌లిమిటెడ్‌ పరిశ్రమను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్‌ హరికుమార్‌, మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ

అనంతపురం: పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఈ.భీమారావు అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి, కాలుష్య రహిత సమాజ స్థాపనకు పర్యావరణ ఆవశ్యకతను గుర్తించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement