ఇద్దరిని బలిగొన్న నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరిని బలిగొన్న నిర్లక్ష్యం

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

విద్యుదాఘాతంతో తండ్రీకుమారుడు దుర్మరణం

పంచాయతీ బోరు మోటర్‌ మరమ్మతు చేస్తుండగా ఘటన

గుమ్మఘట్ట: అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. విద్యుదాఘాతంతో మెకానిక్‌లైన తండ్రీకుమారులు దుర్మరణం చెందారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లికి చెందిన ఆనంద్‌, రాధమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఆనంద్‌ (50), చిన్న కుమారుడు తేజ (25) విద్యుత్‌ మోటర్లు రిపేరీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గుమ్మఘట్ట మండలం కరిసూరయ్యదొడ్డి గ్రామంలో తాగునీటి మోటర్‌ చెడిపోయింది. దీని రిపేరీ కోసం శుక్రవారం ఆనంద్‌, తేజను పిలిపించారు. వీరు వాహనం సహాయంతో మోటర్‌ను వెలికితీసేందుకు ఉపక్రమించారు. మోటర్‌ పై భాగంలో 11కేవీ విద్యుత్‌ లైన్‌ ఉంది. అయితే విద్యుత్‌ సరఫరా ఉన్న సమయంలోనే మోటర్‌, ఇరన్‌ పైపు తీస్తుండగా 11కేవీ విద్యుత్‌లైన్‌ను తగిలింది. అంతే ఆనంద్‌, తేజ విద్యుదాఘాతానికి గురై క్షణాల్లో ప్రాణం విడిచారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన రేవన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆస్పత్రిలో చేర్చారు. తండ్రీకుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో బొమ్మక్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పంచాయతీ అధికారులు మోటర్‌ రిపేరీ సమయంలో విద్యుత్‌ అధికారుల నుంచి ఎల్‌సీ తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు చర్చించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో మృతి చెందిన తండ్రీకుమారుడు ఆనంద్‌, తేజ

Advertisement
 
Advertisement
Advertisement