అనంతపురం అగ్రికల్చర్: రాగల రెండు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకుల కుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షం, మిగిలిన ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా శుక్రవారం నార్పల, శింగనమల, ఆత్మకూరు, గుంతకల్లు, అనంతపురం, బుక్కరాయసముద్రం, విడపనకల్లు, తాడిపత్రి, కూడేరు, శెట్టూరు, యల్లనూరు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది.
నేడో రేపో ‘నైరుతి’ ప్రవేశం
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. గురువారం కేరళ, మరికొన్ని ప్రాంతాలను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 6 లేదా 7న జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు పంటలు విత్తుకునేందుకు అనుకూలమని చెబుతున్నారు. మంచి వర్షాలు కురిస్తే ఏరువాక జోరందుకోనుంది.
‘సర్’పై నేడు రాజకీయ సమావేశం
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో శనివారం సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలని కోరారు.


