బాల్యం.. బలహీనం
● అంగన్‌వాడీ సరుకుల్లో నాణ్యత డొల్ల
● దృష్టి సారించని చంద్రబాబు ప్రభుత్వం
రాయదుర్గం: బాల్యం బక్కచిక్కుతోంది. పౌష్టికాహార లోపం వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు ఎదిగేకొద్ది రుగ్మతలతో నలిగిపోతున్నారు. జిల్లాలో 2,302 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 0–6 నెలల్లోపు పిల్లలు 10,361.. 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 65,605.. 3–6 ఏళ్లలోపు పిల్లలు 46,894 మొత్తం 1,22,860 మంది ఉన్నారు. గత నెలలో 1,21,930 మంది చిన్నారులను పరీక్షించగా, ఘోరమైన విషయాలు వెల్లడయ్యాయి. వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లలు 7,169, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు 2,760 మంది ఉన్నట్లు తేలింది. పోషణ లోపం ఉన్న పిల్లలు 2,220 మంది, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న వారు 640 మంది ఉండడం గమనార్హం.
పోషకాహారం లేకనే..
సరైన పోషకాహారం అందకపోవడంతోనే ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు ఉండటం లేదు. అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న కోడిగుడ్లు, పాలు,కందిపప్పు,నూనె,చిక్కీ, రాగిపిండి, ఎండు కర్జూరం, బియ్యం, బెల్లం తదితర సరుకుల్లో నాణ్యత తీసికట్టుగా మారింది. రాగిపిండిలో అయితే ఇసుక రేణువులు కనిపిస్తున్నాయి. గోలీ సైజులో ఉండే కోడిగుడ్లు సరఫరా చేస్తూ చిన్నారుల పొట్ట కొడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పోషకాహారం అందేలా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.
ఏదీ పర్యవేక్షణ?
అంగన్‌వాడీలపై పర్యవేక్షణ కొరవడడంతోనే దుస్థితి తలెత్తుతోందనే విమర్శలు ఉన్నాయి. బొమ్మనహాళ్ మండలం కురువళ్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఇటీవల కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువుల రిజిస్టర్‌ను పరిశీలించారు. తప్పుల తడకగా ఉండడంతో కార్యకర్తపై చర్యలు తీసుకున్నారు. రాయదుర్గంలో నెల రోజుల నుంచి సీడీపీఓ కుర్చీ ఖాళీగా దర్శనమిస్తోంది. కనీసం వేరొకరికి ఇన్‌చార్జ్ ఇవ్వలేదు. జిల్లాలోని చాలా చోట్ల ఇలాంటి దుస్థితే నెలకొంది. ఈ క్రమంలో అంగన్‌వాడీలపై పర్యవేక్షణ కరువై అంతా ఇష్టారాజ్యంగా మారింది.
సమతుల ఆహారం తీసుకోవాలి
గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకుంటే రక్తహీనత నుంచి గట్టెక్కవచ్చు. బిడ్డకు ఆరు నెలల వరకూ తల్లిపాలే పట్టించాలి. ఏడాది తర్వాత పోషకాలు, విటమిన్లు ఉండే ఆహారం అందించాలి. ఉదయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
– మెర్జీ జ్ఞానసుధ, ఏరియా ఆస్పత్రి
సూపరింటెండెంట్, రాయదుర్గం
నాణ్యత లేని సరుకులు ఇస్తే చర్యలు
అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపడతాం. ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రక్తహీనత నివారణకు చర్యలు చేపడతాం. రాయదుర్గంకు త్వరలో సీడీపీఓను నియమిస్తాం.
– శశికళ, ఐసీడీఎస్ పీడీ


