అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జీవిగారి శివప్రసాద్ శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, కమ్మన్న, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతాపరెడ్డి, జయరామ్ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సెస్సు వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. అధికారులు, సిబ్బంది ఒకేతాటిపై నిలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
● తాత్కాలిక (ఎఫ్‌ఏసీ) కార్యదర్శిగా సేవలందించిన కమ్మన్నను రవికుమార్ నాయుడు, రామాంజనేయులు, గోవిందు, రాజు, రామాంజనమ్మ తదితరులు సన్మానించారు.
నేటి నుంచి ‘మన డబ్బులు–మన లెక్కలు’పై సదస్సులు
అనంతపురం టౌన్: జిల్లాలో 16 మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు ‘మన డబ్బులు – మన లెక్కలు’ యాప్‌పై ఈ నెల 20వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సంఘం పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి సభ్యులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. తీసుకున్న రుణం, చెల్లించిన రుణం, సభ్యులు చేసుకున్న పొదుపు వివరాలను తెలియజేయాలన్నారు. ప్రతి సంఘం సభ్యురాలు ‘మన డబ్బులు – మన లెక్కలు’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సంఘం వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునన్నారు. రుణం, పొదుపు వివరాలను మ్యానువల్ పుస్తకంలో నమోదు చేయడంతో పాటు మొబైల్ యాప్‌లో సైతం నమోదు చేయించే విధంగా వీఓలు, సీసీలు చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యుత్ స్తంభంపై
నుంచి పడి వ్యక్తి మృతి
గుత్తి: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ఎస్ పల్లికి చెందిన రామాంజనేయులు (38) అలియాస్ రామన్న విద్యుత్ స్తంభం నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ఎస్ పల్లికి చెందిన రామాంజనేయులు ప్రైవేట్ విద్యుత్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పెద్దవడుగూరు మండలం జీ–వెంకటాం పల్లిలోని ఓ పొలంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్‌కు గురై కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును గుత్తి ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో చోటు
అనంతపురం: వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన యు.నాగార్జున వైఎస్సార్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఎస్.ఖాసీఫ్‌ఆలీ, టి.వెంకట రెడ్డి జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా, మనోవిశ్వాస్ రెడ్డి జిల్లా ఐటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా, దామోదర్ రెడ్డి, కొండారెడ్డిని జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీలుగా, బ్రహ్మానంద రెడ్డిని జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, జి. నారాయణ రెడ్డి, నంజుండప్పను జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
మచ్చుకత్తితో వ్యక్తి వీరంగం
డీ హీరేహాళ్ (రాయదుర్గం): డీ హీరేహాళ్ మండలంలోని మురడిలో వీరేష్‌రెడ్డి అనే వ్యక్తి మచ్చుకత్తితో వీరంగం సృష్టించాడు. గురువారం రాత్రి గ్రామానికి చెందిన నాగరాజురెడ్డి, వీరేష్‌రెడ్డి మధ్య స్థలం విషయంపై ఘర్షణ జరిగింది. స్థానికుడు నరసింహారెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. వీరేష్‌రెడ్డి రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. స్థానికులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే, చీకటి పడ్డాక తప్పతాగి వచ్చిన వీరేష్ రెడ్డి మచ్చు కొడవలి పట్టుకుని బీభత్సం సృష్టించాడు. ‘మీ అంతుచూస్తా..ఈ రోజు నరికే వెళతా’నంటూ హల్‌చల్ చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీ హీరేహాళ్ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి గ్రామానికి చేరుకుని విచారించారు. వీరేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


