యథేచ్ఛగా చౌక బియ్యం మేత | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా చౌక బియ్యం మేత

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

అనంతపురం అర్బన్‌: చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు రేషన్‌ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. ఇటీవల ‘నగదు బదిలీ’ దందాకు తెరతీశారు. కార్డుదారులతో నేరుగా వ్యాపారం చేస్తున్నారు. ఇళ్లవద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేసినట్లుగా ఈపాస్‌లో వేలిముద్ర వేయించుకుని కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు చెల్లిస్తున్నారు. తమకు డబ్బు వద్దు.. సరుకులు కావాలనే కార్డుదారులకు కూడా బలవంతంగా డబ్బు అంటగడుతున్నట్లు తెలిసింది.

బరితెగింపు..

ప్రతి నెలా 26 తేదీన వృద్ధులకు, నిస్సహాయులకు వారి ఇళ్ల వద్దకే డీలర్‌ వెళ్లి బియ్యం పంపిణీ చేయాలి. ఇతర కార్డుదారులకు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక దుకాణం వద్దనే బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక దుకాణాల్లో సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా కొందరు ఘనులు 1వ తేదీనే బియ్యం పంపిణీ పూర్తి చేయడం చూస్తే ఎంతగా బరి తెగించారో స్పష్టమవుతోంది.

ఇదిగో సాక్ష్యం..

అనంతపురం నగరంలోని 1285015 నంబరు చౌక దుకాణం పరిధిలో 529 కార్డులు ఉన్నాయి. ఇక్కడి డీలరు మే నెల 29వ తేదీన 22 కార్డులకు, 30వ తేదీన 16.. 31వ తేదీన 259, జూన్‌ 1వ తేదీన 232 ఇలా మొత్తం 529 కార్డులకూ సరుకులు పంపిణీ చేసినట్లు చూపాడు. గతంలోనూ ఈ చౌక దుకాణం డీలర్‌ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా తీరు మార్చుకున్నట్లుగా లేదనే విషయాన్ని ప్రస్తుత నెల పంపిణీ తీరు చెబుతోంది. ఇక్కడొక్కటే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

బ్లాక్‌ మార్కెట్‌కు..

పలువురు డీలర్లు కార్డుదారులకు బియ్యం ఇవ్వ కుండా బదులుగా కిలోకు రూ.10 నుంచి రూ.15 డబ్బులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఒక రకంగా కార్డుదారులతోనే డీలర్‌ వ్యాపారం చేస్తున్నాడు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో కిలో రూ.20 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

కార్డుదారులతో వ్యాపారం చేస్తున్న పలువురు డీలర్లు

బియ్యానికి బదులు డబ్బులిస్తున్న వైనం

సరుకులు కావాలన్న వారికీ మొండిచేయి

Advertisement
 
Advertisement
Advertisement