లాడ్జీల్లో విజిటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం | - | Sakshi
Sakshi News home page

లాడ్జీల్లో విజిటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో హోటళ్లు, లాడ్జీల్లో బస చేసే సందర్శకుల వివరాల నమోదుకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సాంకేతికతతో రూపొందించిన విజిటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను ఎస్పీ జగదీష్‌ ప్రారంభించారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జీల యజమానులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ సందర్శకులు వచ్చిన వెంటనే వివరాలు పంపితే తన కార్యాలయానికి రియల్‌ టైమ్‌లో చేరతాయన్నారు. విదేశీ పర్యాటకుల సమాచారాన్ని కూడా వేగంగా పంపవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ అశ్విన్‌ మణిదీప్‌, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

డబ్బు ఆశ చూపుతారు.. దోచేస్తారు

ఘరానా ముఠా అరెస్ట్‌ రూ.1.35 లక్షలు స్వాధీనం

అనంతపురం సెంట్రల్‌: ‘రూ. లక్షకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తాం..బ్లాక్‌ నోట్లను కెమికల్స్‌ ద్వారా ఒరిజనల్‌ నోట్లుగా మారుస్తాం’మంటూ అమాయక ప్రజలను నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వివరాలను ఎస్‌ఐ ప్రసాద్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామానికి చెందిన పానుగంటి నాగ శంకర్‌, కర్నూలు జిల్లా బెలగాల మండలం బ్యాతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేష్‌, కమ్మరి పరుశురాముడు ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో సామాన్య ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారు. రూ. లక్ష నిజమైన నగదు ఇస్తే కెమికల్‌ సాయంతో నకిలీ కరెన్సీని ఒరిజనల్‌గా మారుస్తామని నమ్మబలికేవారు. బాధితులను నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకొని పరారయ్యేవారు. నిందితుల ఆచూకీపై సమాచారం రావడంతో తపోవనం సర్వీసు రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాతో పాటు నంద్యాల, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement