పామిడి: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి జనాన్ని నట్టేట ముంచిందని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పామిడిలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి నైరుతిరెడ్డి హాజరై మాట్లాడారు. హామీలు పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన అబద్ధాలకోరు బాబుకు ప్రజలు బుద్ధి చెప్పేరోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్కహామీనీ సక్రమంగా అమలుచేయకపోవడంతో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. అవినీతి– అక్రమాలు, దందాలు–దౌర్జన్యాలు, కుళ్లు– కుతంత్రాలే ధ్యేయంగా బాబు పాలన సాగుతోందని దుయ్యబట్టారు.అభివృద్ధి–సంక్షేమాన్ని అటకెక్కించి డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సూపర్‌సిక్స్ హామీలు నెరవేర్చే వరకూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమిస్తామిన్నారు. అనంతరం ఎన్నికల మేనిఫెస్టోను, బాండ్ల ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, మేధావులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


