పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ నిర్వహణ

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

అధికారులకు డీఆర్‌ఓ మలోల ఆదేశం

అనంతపురం అర్బన్‌: ‘‘ఓటరు జాబితాలో అనర్హులకు చోటు ఉండకూడదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. తప్పులు లేని, కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా లక్ష్యంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను పకడ్బందీగా నిర్వహించాలి’’ అని డీఆర్‌ఓ, డిప్యూటీ ఎన్నికల అధికారి ఎ.మలోల సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘సర్‌’ నిర్వహణపై డీఆర్‌ఓ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఈడీటీలు, బీఎల్‌ఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకమన్నారు. దోషరహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్‌తో పాటు ప్రతి అంశంలోనూ పారదర్శకంగా విధులు నిర్వర్తించా లని చెప్పారు. ఈనెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు ఉంటాయన్నారు. 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న వారి ఓట్లు తొలగించాలన్నారు. బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓ) తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇవ్వాలన్నారు. సర్వే సమయంలో బీఎల్‌ఓలు తగినన్ని ఫారం–6, 7, 8లను వెంట ఉంచుకోవాలని ఆదేశించారు. 2002–05 ఓటర్ల జాబితా, 2025 ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుకుని మ్యాపింగ్‌ పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ చేయాలన్నారు. సమావేశంలో కో–ఆర్డినేషన్‌ విభాగం సూపరింటెండెంట్‌ యుగేశ్వరిదేవి, ఎన్నికల డీటీ కనకరాజు, డీటీ మంజుల, ఎస్‌ఏ శామ్యూల్‌ బెంజిమన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement