అనంతపురం అగ్రికల్చర్: ఇష్టారాజ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక కృషిభవన్‌లో అనంతపురం డివిజన్ పరిధిలో ఉన్న ఆరు మండలాల ఇన్‌పుట్ డీలర్లు, దుకాణాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత మందులు, విత్తనాలు, ఎరువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ప్రధానంగా యూరియా, డీఏపీ అమ్మకాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. కొత్తగా యాప్ అందుబాటులోకి వస్తున్నందున రైతు భూ విస్తీర్ణం, సాగు చేసిన పంటను బట్టి ఎరువుల అమ్మకాలు ఉంటాయన్నారు. బయోమెట్రిక్ పద్ధతిలోనే అమ్మకాలు కొనసాగించాలని, ఎంఆర్‌పీలు, రైతుకు బిల్లులు, స్టాకు రిజిస్టర్లు, భౌతిక, ఆన్‌లైన్‌లో వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. నిరంతరం నిఘా ఉంటుందని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఏడీఏ ఏ.వెంకటకుమార్, ఏఓలు రాకేష్‌నాయక్, సోమశేఖర్, శుభకర్, శ్యాంసుందరరెడ్డి పాల్గొన్నారు.


