అనంతపురంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, పార్టీ శ్రేణులు
అనంతపురం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ‘చంద్ర గ్రహణం’ పట్టుకుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘ వెన్నుపోటుకు రెండేళ్లు ’ నిరనన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టోతో పాటు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పేరుతో ఇచ్చిన హామీల బాండ్లను నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. అనంత మాట్లాడుతూ చంద్రబాబు పాలనను రెండు మాటల్లో చెప్పాలంటే.. అవినీతి–అక్రమాలు, దందాలు–దౌర్జన్యాలు, కుట్రలు–కుతంత్రాలే అని అభివర్ణించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిందేమీ లేదని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, ఎస్‌ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీసీ రమేష్‌గౌడ్, గౌస్ బేగ్, అనంత చంద్రారెడ్డి, వెన్నం శివారెడ్డి, మాజీ మేయర్ వసీం సలీం, కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతా సోమశేఖర్‌రెడ్డి, బోయ కృష్ణమూర్తి, చామలూరు రాజగోపాల్, శివబాల, శ్రీదేవి, కృష్ణవేణి, డాక్టర్ శంకరయ్య, కట్టుబడి తానీషా పాల్గొన్నారు.
తెలుగు దోపిడీ పార్టీ
తెలుగుదేశం పార్టీ ప్రజాసేవా పార్టీ కాదని, ‘తెలుగు దోపిడీ పార్టీ’గా మారిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో గురువారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాపంపేట నుంచి విద్యారణ్యనగర్ వరకు ర్యాలీ చేపట్టి, మార్గమధ్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యారణ్యనగర్‌లో ఇటీవల కూల్చివేసిన ఇళ్ల స్థలాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి పేరుతో అమరావతికే ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆత్మకూరులోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి.
ఒక్క హామీనైనా నెరవేర్చారా?
మేనిఫెస్టోలో ప్రకటించి.. ఏ ఒక్క హామీని నెరవేర్చని ఘన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదేనని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు, కంబదూరు మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు, పార్టీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య హాజరై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దగా కోరు ప్రభుత్వాన్ని గద్దెదింపే రోజులు దగ్గర పడ్డారని ధ్వజమెత్తారు.
అన్ని వర్గాలనూ మోసం చేశారు
వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డి విమర్శించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి తదితర హామీల అమలు ఏమైందని నేతలు ప్రశ్నించారు. గుమ్మఘట్ట, రాయదుర్గం, డీ హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పండి?
ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్, కూడేరు మండల కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. మేనిఫెస్టోను తగలబెట్టి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండేళ్ల పాలనలో ఎన్ని హామీలను అమలు చేశారో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న ప్రశ్నించారు.
మేనిఫెస్టో, బాండ్లు దహనం
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో.. ప్రజలకిచ్చిన బాండ్ పేపర్లను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల్లో హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమి కాదని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో అరాచక పాలన
అరాచక పాలనకు చంద్రబాబు ప్రభుత్వం పరాకాష్టగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాడిపత్రి పట్టణంలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం సూపర్ సిక్స్ హామీల పత్రాలను, బాండ్లను తగలబెట్టారు. పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమాలు, భూదందాలు, దౌర్జన్యాలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారి కుటుంబాలను హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పేరం స్వర్ణలత పాల్గొన్నారు.
ప్రభుత్వ తీరుపై నిరసనాగ్రహం
శింగనమల నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, మాజీ సమన్వయకర్త వీరాంజినేయులు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీగోకుల్‌రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
చంద్రబాబు పాలనపై వెల్లువెత్తిన నిరసన
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు
పలు చోట్ల టీడీపీ మేనిఫెస్టో పత్రాలు దహనం
రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని నేతల ధ్వజం
సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు


