రాప్తాడు రూరల్: ప్రతి పేదవాడి జీవితంలో సొంతిల్లు ఓ కల. కూలినాలి చేసుకుంటూ, తినీతినక రూపాయి రూపాయి దాచుకుని ఓ చిన్న ఇంటి స్థలం కొనుక్కోవాలని, పిల్లలకు తలదాచుకునే నీడ కల్పించాలని ఎన్నో కుటుంబాలు కలలు కంటుంటాయి. ఆ ఆశలనే కొందరు దళారులు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అధికార పార్టీ అండతో భవిష్యత్తులో పట్టాలు వస్తాయన్న హామీలతో పేదల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. చివరకు అధికారులు రంగంలోకి దిగితే దళారులు కనిపించకుండా పోతున్నారు. దీంతో నిరుపేదలు నష్టపోతున్నారు.
మాయ మాటలతో మోసం
అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలోని 153 సర్వే నంబరు తడకలేరు వంక పొరంబోకు భూమిలో ఎమ్మెల్యే పరిటాల సునీత పేరు చెప్పుకుని రామగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి గుడిసెలు వేయించాడు. ‘ఎలాంటి ఇబ్బంది ఉండదు‘, ‘శాశ్వత ఇళ్లు కట్టుకోవచ్చు’, ‘పట్టాలు కూడా వస్తాయి‘ అంటూ భరోసా కల్పించాడు. వారి మాటలు నమ్మిన పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఒక్కో గుడిసెకు రూ. 40 వేలు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. కొందరు అప్పులు చేసి శాశ్వత నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అయితే గురువారం తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జేసీబీలతో అక్కడికి చేరుకున్న అధికారులు గుడిసెలను కూల్చివేశారు. కుటుంబాలను నిద్రలేపి, బలవంతంగా బయటకు పంపించి నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి, కూలర్లు, నిత్యావసరాలు, కష్టపడి కొనుగోలు చేసిన వస్తువులు శిథిలాల కింద నలిగిపోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చిన మహిళలు, పిల్లల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. అలాగే 41 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో ఓ కుల సంఘం నాయకుడు ఇదే తరహాలో గుడిసెలు వేయించాడు. వాటిని కూడా అధికారులు బలవంతంగా తొలగించారు.
దళారులపై చర్యలు తీసుకోవాలి
ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వసూళ్లు చేసిన వారి ఆస్తులను గుర్తించి బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పేదల గుడిసెలను కూల్చివేసిన దృశ్యం, గుడిసె కూల్చివేయడంతో చంటిబిడ్డతో దిగాలుగా కూర్చొన్న మహిళ
ఈ పాపం ఎవరిది?
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయడం తప్పేనని అందరికీ తెలుసు. కానీ ఆ గుడిసెలు ఒక్కరోజులో వేయలేదు. నెలల తరబడి నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో గుడిసెలు ఏర్పడ్డాయి. శాశ్వత నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇంత జరుగుతున్న సమయంలో అధికారులు ఎక్కడ ఉన్నారు? ప్రజాప్రతినిధులకు తెలీకుండా జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటి గుడిసె వేసిన రోజే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇన్ని కుటుంబాలు నష్టపోయేవా? పది గుడిసెలు ఏర్పడినప్పుడు హెచ్చరించి ఉంటే ప్రజలు అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టేవారా? ఈరోజు గుడిసెలు నిర్ధాక్షిణ్యంగా పీకేస్తే ఈ పాపం ఎవరిది? అనే ప్రశ్న తలెత్తుతోంది.
వంక పొరంబోకు భూముల్లో గుడిసెలు వేయించిన దళారులు
ఒక్కొక్కరితో రూ.40 వేలు వసూలు !
నెలల తరబడి పట్టించుకోని అధికారులు
ఉన్నఫళంగా జేసీబీలతో గుడిసెల నేలమట్టం
లబోదిబోమంటున్న పేదలు


