● కలెక్టర్ ఆనంద్
బుక్కరాయసముద్రం: జిల్లాలో రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని బొమ్మలాటపల్లిలో పీఎండీఎస్.ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ విధానం అమలును కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు పెళ్లె టైజ్డ్ పీడీఎంఎస్ ఉత్తమ ప్రత్యామ్నాయమన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ వర్షపాతం, పరిమిత నీటి లభ్యత ఉన్న రైతులకు ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ విధానం తక్కువ నీటితో ఆరుతడి పంటలను విజయవంతంగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే పొలాల్లో ఏడాది పొడవునా జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. అనంతరం బీకేఎస్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో సెర్ప్, వెలుగు సంస్థ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ‘మన డబ్బులు – మన లెక్కలు’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ విజయ శంకర్‌బాబు, ఏడీఏ వెంకట్, మండల వ్యవసాయ అధికారి శ్యాం సుంధర్‌రెడ్డి, డాక్టర్ న వీన్, డాక్టర్ నరేంద్ర, ఏపీఎం అనితాదేవి, ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా 27 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో ఇటీవల డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి పొందిన ఎ.హరికుమార్‌ను బాపట్ల ఆర్‌డీఓగా నియమించారు. ప్రస్తుతం ఈయన రాయదుర్గం తహసీల్దారుగా ఉన్నారు. అలాగే పి.విజయకుమారిని శ్రీసత్యసాయి జిల్లా కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీగా నియమించారు. ప్రస్తుతం ఈమె రాప్తాడు తహసీల్దారుగా ఉన్నారు. హెచ్‌ఎల్‌ఎల్‌సీ (భూసేకరణ) ఎస్‌డీసీగా ఉన్న ఎం.రామ్మోహన్‌ను అనంతపురం జిల్లా కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీగా నియమించారు. హెచ్‌ఎల్‌ఎల్‌సీ (భూసేకరణ) ఎస్‌డీసీగా వి.వెంకటనారాయణను నియమితులయ్యారు.
తహసీల్దార్లకు
స్థానాల కేటాయింపు
అనంతపురం అర్బన్: తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన వారికి స్థానాలు కేటాయించారు. ఈ మేరకు కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన పది మంది తహసీల్దార్లు పోస్టింగ్ దక్కించుకున్నారు. ఆర్.సూర్యప్రతాప్ రాయదుర్గం తహసీల్దార్‌గా, పి.రవిచంద్ర తాడిపత్రి, పీజీ అరుణ ఉరవకొండ, పి.సింధు యల్లనూరు, డి.వెంకటేశ్వరమ్మ విడపనకల్లు, సి.జయశ్రీ వజ్రకరూరు, జి.విజయలక్ష్మి ల్యాండ్ రీఫామ్స్ (కలెక్టరేట్), పీఎంవీ మనోజ్ డీఏఓ (అనంతపురం ఆర్‌డీఓ ఆఫీసు), వై.బాలమ్మ పుట్లూరు, ఎం.ఉదయభాస్కర్ అనంతపురం రూరల్ తహసీల్దార్‌గా నియమితులయ్యారు.


