ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లయినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు చేసింది శూన్యమని ఏపీటీఎఫ్–1938 సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప తెలిపారు. స్థానిక ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపీటీఎఫ్–1938 జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయినా 12వ పీఆర్‌సీ ప్రకటించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో పాటు డీఏ బకాయిలు, 2022లో సరెండర్ సెలవుల బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. 2018 నుంచి వివిధ టెజ్రరీల్లో పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులకు జీఓ 342 పైన ఉన్నత విద్య అభ్యసించే వెసులుబాటు యదాతథగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సాకే భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్లు భాస్కర్, దాదాఖలందర్, తాలుకా వైస్ చైర్మన్ కిశోర్, మండల అధ్యక్షులు గోపాల్, ఆదినారాయణ, గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు
అనంతపురం అర్బన్: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. రెండో విడతలో 97 మందికి అక్రిడిటేషన్ మంజూరు చేశామన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమాచార శాఖ ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ , డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, సభ్యులు అయూఫ్, షఫీ ఉల్లా, రవికుమార్, ప్రతాప్, అనిల్‌కుమార్‌రెడ్డి, మల్లికార్జునరావు, రసూల్, రామాంజనేయులు, ఆర్‌వీఎస్‌ప్రసాద్, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, ఏసీఎల్ లావణ్య, ఆర్‌టీసీ ఆర్‌ఎం శ్రీలక్ష్మి, సమాచారశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
17 నుంచి గూగూడు బ్రహ్మోత్సవాలు
నార్పల : జిల్లాలో ప్రసిద్ధి చెందిన గూగూడు కుళ్లాయిస్వామి (మొహ ర్రం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 17నుంచి ప్రారంభం కానున్నాయి. 29న చివరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈఏడాది ఉత్సవాల నిర్వహణకు వందేళ్లు కానున్నాయి. దీంతో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఇలా..
17న కుళ్లాయి స్వామివారి ప్రఽథమ దర్శనం, 18న స్వామివారి నిత్యపూజ నివేదన, 19న స్వామివారి అగ్నిగుండం ఏర్పాటు, 20న స్వామి వారిని నిలుపుట, 21న స్వామివారికి నిత్యపూజ నివేదన, 22న స్వామివారి ఐదో సరిగెత్తు, 23న స్వామివారి నిత్యపూజ నివేదన, 24న స్వామివారి ఏడో సరిగెత్తు, రాత్రికి దేవుని మెరవణి, 25న స్వామివారి నిత్యపూజ నివేదన, విడిదినం, 26న స్వామివారి గ్రామోత్సవం, పెద్దసరిగెత్తు, రాత్రికి దేవుని మెరవణి , అగ్నిగుండ ప్రవేశం, 27న స్వామివారి అగ్నిగుండ ప్రవేశం, సాయత్రం 4 గంటలకు జలధి, 29న స్వామివారి చివరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి.


