ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి కిట్‌ అందాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి కిట్‌ అందాలి

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

కూడేరు: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి కిట్‌ అందాలని పథకం రాష్ట్ర పరిశీలకురాలు అనురాధ ఆదేశించారు. గురువారం కూడేరులోని ఎమ్మార్సీని ఆమె సందర్శించారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను సరఫరా అయిన పాఠ్య, నోట్‌ పుస్తకాలు, యూనిఫాంను పరిశీలించారు. ఇండెంట్‌ ప్రకారం అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు సరఫరా అయ్యాయా? అని ఆరా తీశారు. మండలానికి చేరిన , ఇంకా కావాల్సిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఎంఈఓ మహమ్మద్‌ గౌస్‌కు ఆదేశించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ చంద్రశేఖర్‌, ఎంఈఓ మహమ్మద్‌ గౌస్‌, సీఆర్‌పీ రమణ, ఎమార్సీ సిబ్బంది ఆంజనేయులు పాల్గొన్నారు.

పోక్సో కేసులో

యువకుడి అరెస్టు

ఉరవకొండ: బాలికను మభ్య పెట్టి వివాహం చేసుకున్న కేసులో చిన్నముష్టూరు బీసీ కాలనీకి చెందిన బోయ వన్నూర్‌స్వామి అనే యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ మహానంది, ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు వివరాలు వెల్లడించారు. చిన్నముష్టూరుకు చెందిన వన్నూర్‌స్వామి బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సెప్టెంబర్‌లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి

ఉరవకొండ/అనంతపురం టౌన్‌: గత ప్రభుత్వంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరై అర్ధంతరంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్‌లోపు లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలని హౌసింగ్‌ పీడీ మాడిచేడు శైలజ తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలోని హౌసింగ్‌ ఏఈలు సిబ్బందితో పీడీ సమీక్ష నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 27,579 ఇళ్లు అర్ధంతరంగా ఆగిపోయాయన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 3,787 మంది ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మున్సిపాల్టీ పరిధిలో ఆవాస్‌ ప్లస్‌ కింద 66,936 మంది సర్వే పూర్తి చేశామని, ఇందులో 42,323 మంది స్థలం ఉండి ఇళ్లులేని వారిని గుర్తించామని, 20వేల మంది ఇళ్లు, స్థలం రెండు లేని వారు ఉన్నారన్నారు. బీఎల్‌, ఎల్‌ఎల్‌, ఆర్‌ఎల్‌ స్థాయిలో ఉన్న గృహాలను సెప్టెంబర్‌లోపు పూర్తి చేసుకోవాలన్నారు. సెప్టెంబర్‌లోపు పూర్తయిన ఇళ్లకు మాత్రమే బిల్లులు మంజూరు అవుతాయన్నారు. ఆప్షన్‌–3 ఇళ్లను ఆప్షన్‌ మార్పు ప్రక్రియను సైతం వేగవంతం చేయాలన్నారు. గృహ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వారితో చర్చించి మార్పు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement