అనంతపురం సెంట్రల్: మహిళల భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. గురువారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో సీ్త్ర రక్ష పోర్టల్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోర్టల్ సర్వేలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు మహిళా పోలీసులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సీ్త్ర రక్ష పోర్టల్ పబ్లిక్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 23 వేల ఇళ్లను సందర్శించి, మహిళలు, చిన్నారుల రక్షణ, చట్టాలపై అవగాహన కల్పిస్తూ వివరాలను సేకరించినట్లు వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, అదనపు ఎస్పీ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
ఏఐ డ్యూటీ రోస్టర్ యాప్ ఆవిష్కరణ
పోలీసుశాఖలో మరో యాప్‌ను ఎస్పీ జగదీష్ గురువారం ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది డ్యూటీల కేటాయింపు పూర్తిగా ఆన్‌లైన్, పారదర్శకంగా చేపట్టేందుకు ఏఐ డ్యూటీ రోస్టర్ యాప్‌ను తీసుకొచ్చారు. ఎలాంటి పక్షపాతం లేకుండా సిబ్బంది సీనియార్టీ, గతంలో చేసిన విధులు, నైపుణ్యాల ఆధారంగా ఏఐ కేటాయిస్తుందని ఎస్పీ తెలియజేశారు. దీంతో సిబ్బందికి మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఉత్సాహంతో పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరెడ్డి, ఆర్‌ఐ పవన్‌కుమార్, ఐటీ టీఎం సభ్యులు పాల్గొన్నారు.
జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు
అనంతపురం టౌన్: వర్షాల కారణంగా ఇసుక కొరత లేకుండా గనులశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ తెలిపారు. జిల్లాలోని యల్లనూరు మండల కేంద్రంతో పాటు మల్లగుండ్లలోని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించి, ప్రస్తుతం 75 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో మిగిలిన 25 వేల టన్నుల ఇసుకను సైతం అందుబాటులోకి తీసుకొచ్చి ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి
పెద్దవడుగూరు : మండలంలోని జి.వెంకటాంపల్లిలో గుత్తి మండలం సూరుసుంకుపల్లికి చెందిన రామాంజనేయులు(55) విద్యుత్ స్తంభంపై నుంచి జారిపడి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. వివరాలు.. మృతుడు గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా చేస్తూ జీవనం సాగించేవాడు. రైతు వెంకటరాముడు పొలంలో మోటారు మరమ్మతు చేయడానికి వెళ్లాడు. మోటారు కనెక్షన్ తొలగించడానికి విద్యుత్ స్తంభం ఎక్కగా, కాలుజారి కింద పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.


