అనంతపురం టవర్‌క్లాక్: పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. పెంచిన ధరలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో ఎన్జీవో హోంలో గురువారం సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి అధ్యక్షత జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం తరచూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అధికంగా పెంచి ప్రజలపై గుదిబండ వేస్తోందన్నారు. ధరలు స్థిరంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పరిపాలన కన్నా ప్రజల నాశనమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, వేమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నాయకులు నాగరాజు, వీరానారాయణ, మల్లికార్జున, వేమన, శ్రీరాములు, కేశవ రెడ్డి, నారాయణ స్వామి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, రాజేష్ గౌడ్, కుళ్లాయి స్వామి, చిరంజీవి, రామాంజనేయులు, పెద్దయ్య, నాగార్జున పార్వతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


