ఓటు తొలగించడం సులభం కాదు | - | Sakshi
Sakshi News home page

ఓటు తొలగించడం సులభం కాదు

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

అనంతపురం అర్బన్‌: ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి భారత ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌–సర్‌) ప్రక్రియ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5 నుంచి 14 వరకు ‘సర్‌’ నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. 15 నుంచి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారు. 2002 జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఓటరుగా ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తారు. అక్కడ నివాసం లేని ఓటర్లను తొలగింపు జాబితాలో చేరుస్తారు. 2002లో అక్కడ ఓటు ఉన్నట్లయితే అందుకు సంబంధించి వివరాలను ఓటరు సంబంధీకులు బీఎల్‌ఓకు సమర్పిస్తే మ్యాపింగ్‌ చేస్తారు. ఒకే కుటుంబంలో ఓటర్లుగా ఉన్న వారందరినీ ఒకే బూత్‌లో ఉండేలా చూస్తారు.

మ్యాపింగ్‌ కాకపోతే ఇబ్బందే

ఓటరుగా మ్యాపింగ్‌ కాకపోతే ఇబ్బంది తప్పదు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 20,38,523 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 13,86,365 మంది ఓటర్ల మ్యాపింగ్‌ జరిగింది. ఇంకా 6,52,158 మంది ఓటర్ల మ్యాపింగ్‌ కావాల్సి ఉంది. ఇప్పటికే మ్యాపింగ్‌ అయిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందీ లేదు. మ్యాపింగ్‌ కాని వారంతా మ్యాపింగ్‌ చేసుకోని పక్షంలో ఓటు కోల్పోవాల్సి వస్తుంది. మ్యాపింగ్‌ కోసం ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తారు. మ్యాపింగ్‌ కాని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మ్యాపింగ్‌ చేయించుకోవాలి. అత్యధికంగా మ్యాపింగ్‌ కాని ఓటర్లు అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిధిలో 1,08,684 మంది, రాప్తాడులో 1,02,944 మంది ఉన్నారు. అత్యల్పంగా గుంతకల్లు నియోజకవర్గం పరిధిలో 28,639 మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో 77 వేల నుంచి 86 వేల మంది ఓటర్లు మ్యాపింగ్‌ కాలేదు.

బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

‘సర్‌’ విషయంలో రాజకీయ పార్టీలు, వారి పార్టీల బీఎల్‌ఏ (బూత్‌ లెవల్‌ ఏజెంట్‌)లు అప్రమత్తంగా ఉండాలి. తమ బూత్‌ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు.. ఎంత మంది మ్యాపింగ్‌ అయ్యారు.. ఎంత మంది ఓటర్లు మ్యాపింగ్‌ కాలేదు.. అనే వివరాలను తెలుసుకుని ఉండాలి. మ్యాపింగ్‌ కాని ఓటర్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండేలా చూడాలి. బీఎల్‌ఓ వచ్చినప్పుడు వివరాలను సమర్పించేలా చూసి మ్యాపింగ్‌ చేయించాలి. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంటిలో లేకపోతే.. ఆ ఇంటిలో ఉన్న ఆ ఓటరు తాలూకు బంధువుల నుంచి వివరాలు ఇప్పించి మ్యాపింగ్‌ చేయించాలి.

ఓటు తొలగిస్తే ఆందోళన వద్దు

ఒక ఇంటిలో ఓటరుగా ఉన్నప్పటికీ పొరపాటున ఓటు తొలగిస్తే ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

14వ తేదీ వరకు సిబ్బందికి శిక్షణ

15 నుంచి బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే

జిల్లాలో మొత్తం ఓటర్లు 20,38,523

మ్యాపింగ్‌ అయిన ఓటర్లు 13,86,365

మ్యాపింగ్‌ చేసుకోవాల్సిన ఓటర్లు 6,52,158

మ్యాపింగ్‌ కాకపోతే ఓటు కోల్పోయే పరిస్థితి

‘సర్‌’పై శిక్షణ ఇవ్వాలి

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. ‘సర్‌’పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘సర్‌’పై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలకు శిక్షణ నిర్వహించాలని డీఆర్‌ఓను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో కో–ఆర్డినేషన్‌ విభాగం అధిపతి యుగేశ్వరీదేవి, ఎన్నికల విభాగం డీటీ కనకరాజు, ఎస్‌ఏ శామ్యూల్‌ బెంజిమన్‌ తదితరులు పాల్గొన్నారు.

‘సర్‌’ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటు తొలగించడం అంత సులభం కాదు. మ్యాపింగ్‌ అయిన ఏ ఒక్కరి ఓటునూ తొలగించేందుకు వీలుండదు. జిల్లా ఓటర్లలో 68 శాతం మ్యాపింగ్‌ అయ్యారు. మిగిలిన ఓటర్లను మ్యాపింగ్‌ చేసేందుకు ఈ నెల 7 నుంచి 14 తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. 2002లో ఓటరుగా ఉంటే... ఆ వివరాలను చెప్పి మ్యాపింగ్‌ చేసుకోవచ్చు. బీఎల్‌ఓలు ఇంటికి వచ్చినప్పుడు వయసు 18 ఏళ్లు నిండినట్లు, నివాస ధ్రువీకరణకు సంబంధించి ఏదేని ధ్రువపత్రం (ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంక్‌ పుస్తకం, విద్యుత్‌ బిల్లు) చూపిస్తే సరిపోతుంది. ఇక రెండు చోట్ల ఓటుంటే ఒక చోట ఓటును తొలగిస్తారు. బీఎల్‌ఓలకు రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు సహకరించాలి.

– ఎ.మలోల, జిల్లా రెవెన్యూ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement