గూగూడు.. సమస్యలు బోలెడు | - | Sakshi
Sakshi News home page

గూగూడు.. సమస్యలు బోలెడు

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

నార్పల : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు గూగూడులో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి ఏటా ఉత్సవాల వేళ భారీ ఆదాయం సమకూరుతున్నా భక్తులకు వసతులు కల్పించడంలో దేవదాయ శాఖ, అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సరిపడు వసతి గదులు అందుబాటులో లేవు. కల్యాణకట్ట వద్ద తలానీలాలు సమర్పించే చోట తగినన్ని బాత్రూములు లేవు. నెల రోజులు ముందు నుంచి వసతుల కల్పనపై దృష్టి సారించాల్సి ఉండగా తాత్సారం చేశారు. ఇటీవలే రెండు, మూడు బాత్రూముల నిర్మాణం చేపట్టారు. ఇవి ఏమాత్రమూ చాలవని.. ఆలయ నలు దిక్కులా అవసరమైనన్ని బాత్రూములను అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు. ఇక కల్యాణ కట్ట వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడిన చోట నీరు నిలిచి మడుగును తలపిస్తున్నాయి.

అధ్వానంగా గదులు

గూగూడు కుళ్లాయిస్వామి దేవాలయ ఆవరణలో 22 వసతి గృహాలు (సత్రాలు) ఉన్నాయి. వీటితో పాటు సమీప ప్రాంతంలోని గదులు చెత్తాచెదారంతో నిండి అపరిశుభ్రంగా మారాయి. కొన్ని గదుల గోడల పగుళ్లు ఏర్పడి శిథిలావస్థకు చేరినా పట్టించుకోవడం లేదు. మరికొన్ని గదుల తలుపులు దెబ్బతిన్నాయి. కుళాయిలు సరిగా లేక ట్యాంక్‌లోని నీరు వృథాగా పోతున్నాయి.

అపరిశుభ్రంగా కోనేరు

కల్యాణ కట్ట సమీపంలోని కోనేరు అపరిశుభ్రంగా ఉంది. ఎంతో పవిత్రంగా భావించే కోనేరును శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.

నీటి వసతి కల్పనకు చర్యలేవీ?

గూగూడు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతారు. నీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇప్పటికే దేవదాయ శాఖ అధికారులు, మండల అధికారులతో ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అయినా ఇప్పటి వరకు నీటి వసతి కల్పనకు చర్యలు తీసుకోలేదు. ఉత్సవాల ఏర్పాట్లకు తీసుకున్న చర్యల గురించి వివరణ కోసం ఈఓ శోభారాణిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

ఆపరిశుభ్రంగా ఉన్న బాత్రుములు దెబ్బతిన్న గదుల తలుపులు

17 నుంచి గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు

లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

అరకొరగానే తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం

పట్టించుకోని దేవదాయ శాఖఅధికారులు, ప్రజాప్రతినిధులు

Advertisement
 
Advertisement
Advertisement