నేను మెగా డీఎస్సీ–2025లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) పరీక్ష రాసి.. 71.65 మార్కులతో జనరల్‌లో 121వ ర్యాంకు సాధించాను. శ్రీసత్యసాయి జిల్లాలో ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టుల లెక్క ప్రకారం నాకు ఉద్యోగం ఖాయమని భావించా. కానీ ఎంపిక జాబితాలో పేరు లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎస్టీ కేటగిరీలో జిల్లాలో మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి. ఇందులో రెండు మహిళలకు, నాలుగు జనరల్ అభ్యర్థులకు, ఒక పోస్టు నాన్‌లోకల్ కోటాకు కేటాయించారు. నాన్‌లోకల్ అభ్యర్థులు లేని కారణంగా ఆ పోస్టు కూడా స్థానిక ఎస్టీ అభ్యర్థులకే దక్కాలి. ఈ లెక్కన మొత్తం ఐదు పోస్టులు జనరల్ అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చాయి. నాకు జనరల్‌లో 121 ర్యాంకుతో పాటు ఎస్టీ కేటగిరీలో ఐదో స్థానంలో ఉన్నాను. అయినా ఉద్యోగం రాలేదు. ఈ విషయమై మంగళగిరిలోని అధికారులను సంప్రదిస్తే ఆ పోస్టును ‘స్పోర్ట్స్ కోటా’కు కేటాయించినట్లు చెప్పారు. టెట్, డీఎస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అవకాశాలు లేకుండా, ‘ప్రత్యేక కోటా’ పేరుతో పోస్టులు భర్తీ చేయడం వల్ల నాలాంటి వారికి అన్యాయం జరిగింది. ఈసారి ముందుగానే ‘పోస్టు ప్రిఫరెన్స్’ తీసుకోవడం కూడా నా అవకాశాలను దెబ్బతీసింది. మెరిట్ జాబితాలు, తుది ఎంపిక జాబితాలను బహిర్గతం చేయకపోవడంపై అనుమానం కల్గుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే మా చేతుల్లో ఏమీలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి.
– సుగాలి గోపాల్‌నాయక్, కుర్లపల్లి
తండా, కనగానపల్లి మండలం,
శ్రీసత్యసాయి జిల్లా


