● పశుశాఖ జేడీ ప్రేమ్‌చంద్
అనంతపురం అగ్రికల్చర్: బహిరంగ మార్కెట్‌లో కన్నా తక్కువ ధరకే అనంత పాలదాణా పథకం కింద పశువుల దాణాను అందజేస్తున్నట్లు పశు శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తెలిపారు. పశువుల దాణాను పశుపోషకులు వినియోగించుకునేలా గ్రామాల్లో ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశుదాణా పంపిణీపై గురువారం స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయ హాలులో అనంతపురం డివిజన్ డీడీ వై.రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేడీ మాట్లాడారు. దాణా తయారీ కంపెనీలతో మాట్లాడి తొలుత ఏడు మండలాల పరిధిలో 50 కిలోల దాణాను రూ.1,125 చొప్పున రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ల ద్వారా పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. రైతుల నుంచి మంచి స్పందన రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ దాణా పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. లింగనిర్ధారణ వీర్యం (ఎస్‌ఎస్‌ఎస్) పథకం కింద పెద్ద ఎత్తున కృత్రిమ గర్భోత్పత్తి కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్ కింద పశుగ్రాసం పెంపు లక్ష్యంగా ఇప్పటికే ఆర్‌ఎస్‌కేలో రాయితీతో పంపిణీ చేయడానికి గడ్డి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పీఎంఎఫ్‌ఎంఈ కింద పాలు, మాంసం అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్లకు 35 శాతం సబ్సిడీ, బ్యాంకు రుణ సదుపాయం ఉన్నందున ఔత్సాహికులను ప్రోత్సహించాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీలు రవిబాబు, రత్నకుమార్, సురేష్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.
జేసీబీ, ట్రాక్టర్ సీజ్
తాడిపత్రి రూరల్: మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ను గురువారం సీజ్ చేశామని అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. గంగాదేవిపల్లికి చెందిన జేసీబీ డ్రైవర్ లక్ష్మినారాయణ, యుగుడూరుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నాగరాజును అరెస్టు చేశామని సీఐ తెలిపారు.


