టీడీపీ నేత ఇంట పేకాట | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ఇంట పేకాట

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

14 మంది జూదరుల అరెస్ట్‌

రూ.3.85 లక్షల నగదు, కారు స్వాధీనం

గార్లదిన్నె: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు ప్రతి దానినీ ఆదాయవనరుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో యథేచ్ఛగా జూదాలనూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే గార్లదిన్నెలో ఓ టీడీపీ నేత తన ఇంటినే పేకాట స్థావరంగా మార్చి పెద్ద ఎత్తున జూదాన్ని నిర్వహిస్తుండడం కలకలం రేపింది. విషయం పసిగట్టిన పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టడంతో గుట్టు కాస్త రట్టయింది. అనంతపురం రూరల్‌ డీఎస్పీ శ్రీనివాసులు, గార్లదిన్నె పీఎస్‌ ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ బాషా తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కోటి బళ్లారి వెంకటేష్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తూ ఫోన్‌ ద్వారా ముందస్తుగానే జూదరులకు సమాచారం ఇచ్చి, ఆయా ప్రాంతాలకు రప్పించుకునేవాడు. ఈ క్రమంలో ముదిగుబ్బ, బత్తలపల్లి, అనంతపురము మూడో పట్టణ పీఎస్‌ పరిధిలోనూ పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్ని రోజులుగా గార్లదిన్నె మండలానికి చెందిన టీడీపీ నేత ఖాసీం నాయుడుతో కుమ్మకై స్థానిక కెనరాబ్యాంక్‌ సమీపంలో ఉన్న ఆయన ఇంటినే పేకాట స్థావరంగా మార్చి జూదరులకు అన్ని సౌకర్యాలు కల్పించి పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తూ వస్తున్నాడు. రోజూ కొత్త వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికుల ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీనివాసులు అప్రమత్తమయ్యారు. గురువారం తనిఖీలు చేపట్టడంతో ఖాసీం నాయుడు ఇంట్లో సాగుతున్న పేకాట వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. మొత్తం 14 మంది జూదరులను అరెస్ట్‌ చేసి, వీరి నుంచి 14 సెల్‌ఫోన్లు, రూ.3.85 లక్షల నగదు, ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement